ప్రజల సొమ్ముతో, ఉద్యోగుల కష్టంతో దశాబ్దాలుగా నిర్మితమైన ఆర్టీసీని కాపాడాల్సిన ప్రభుత్వం ఇప్పుడు అదే సంస్థను ప్రైవేటు సంస్థల చేతుల్లో పెట్టేందుకు సిద్ధమవుతోందన్న విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే వేల కోట్ల అప్పులతో సతమతమవుతున్న ఆర్టీసీపై మరింత భారం మోపేలా ఈ-బస్సుల ఒప్పందాలు రూపొందుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా రవాణాను బలోపేతం చేయాల్సిన సమయంలో ప్రైవేటు కంపెనీలకు లాభాలు చేకూర్చే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారన్న విమర్శలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ఆర్టీసీ ప్రైవేటీకరణ

ఈ-బస్సులా… లేక ప్రైవేటు కంపెనీలకు బంగారు బాటా?
ఈ-బస్సుల పేరుతో జరుగుతున్న వ్యవహారం కేవలం పర్యావరణ హిత రవాణా కార్యక్రమమా? లేక ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వ ఆస్తులను అప్పగించే మరో ప్రణాళికా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఆర్టీసీకి ఎలాంటి సంబంధం లేని ప్రైవేటు సంస్థలు బస్సులు తెస్తే, వాటి కోసం డిపోలు, పార్కింగ్ స్థలాలు, నిర్వహణ సదుపాయాలు, రూట్లు, సిబ్బంది అన్నీ ఆర్టీసీయే సమకూర్చాల్సి వస్తోంది. కానీ లాభాలు మాత్రం ప్రైవేటు కంపెనీల ఖాతాలోకి వెళ్లే పరిస్థితి కనిపిస్తోందని విమర్శకులు అంటున్నారు.
ఆర్టీసీ ప్రైవేటీకరణ
బస్సు నడిచినా డబ్బులే… నడవకపోయినా డబ్బులే!
ప్రైవేటు ఈ-బస్సుల నిర్వహణ కోసం కిలోమీటరుకు భారీ మొత్తాలు చెల్లించే ఒప్పందాలు ఆర్టీసీ భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
ప్రయాణికులు ఉన్నా లేకపోయినా, ఆదాయం వచ్చినా రాకపోయినా, బస్సు తిరిగిన ప్రతి కిలోమీటరుకు ప్రైవేటు సంస్థలకు చెల్లింపులు చేయాల్సి వస్తుంది. అంటే నష్టాలు మాత్రం ఆర్టీసీకి, లాభాలు మాత్రం ప్రైవేటు కంపెనీలకా? అనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న సంస్థపై ఈ అదనపు భారం పడితే పరిస్థితి మరింత దారుణంగా మారే ప్రమాదం ఉందని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
వేల కోట్ల ఆస్తులపై ఎవరి కన్ను?
ఆర్టీసీ వద్ద రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భూములు, డిపోలు, వర్క్‌షాప్‌లు, వాణిజ్య స్థలాలు వేల కోట్ల రూపాయల విలువ కలిగిన ప్రజా ఆస్తులు.
ఈ ఆస్తుల వినియోగ హక్కులు క్రమంగా ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్తే భవిష్యత్తులో ఆర్టీసీ ఉనికే ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల ఆస్తులను కాపాడాల్సిన ప్రభుత్వం వాటిని ప్రైవేటు ప్రయోజనాల కోసం ఉపయోగించే పరిస్థితిని సృష్టిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఉద్యోగుల భవిష్యత్తు ఏమవుతుంది?
ప్రైవేటీకరణ పెరిగే కొద్దీ ఉద్యోగ భద్రతపై సందేహాలు కూడా పెరుగుతున్నాయి. ఒకప్పుడు ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతానికి చిహ్నంగా నిలిచిన ఆర్టీసీ, ఇప్పుడు ఒప్పందాలు మరియు ఔట్‌సోర్సింగ్ విధానాల వల్ల క్రమంగా బలహీనపడుతోందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.
కొత్త నియామకాల కన్నా ప్రైవేటు ఒప్పందాలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల సంస్థలోని శాశ్వత ఉద్యోగ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆర్టీసీ ప్రైవేటీకరణ
ప్రజా రవాణా సేవా? లేక లాభాల వ్యాపారమా?
ఆర్టీసీ ప్రధాన లక్ష్యం ప్రజలకు అందుబాటు ధరల్లో రవాణా సేవలు అందించడం. కానీ ప్రైవేటు సంస్థల ప్రధాన లక్ష్యం లాభాలు ఆర్జించడం. ఈ రెండు లక్ష్యాలు పరస్పరం విరుద్ధమైనవని నిపుణులు పేర్కొంటున్నారు.
లాభాలు వచ్చే రూట్లను మాత్రమే ప్రైవేటు సంస్థలు ఎంచుకుంటే, గ్రామీణ ప్రాంతాలు మరియు నష్టాల్లో ఉన్న రూట్ల భారం పూర్తిగా ఆర్టీసీపైనే పడే ప్రమాదం ఉంది.
ఆర్టీసీ ప్రైవేటీకరణ
ఆర్టీసీని కాపాడే నిర్ణయాలా… లేక ప్రైవేటీకరణకు చివరి మేకులా?
ఇప్పటికే అప్పుల భారంతో మూలుగుతున్న ఆర్టీసీపై ఈ-బస్సుల ఒప్పందాలు మరో తాటిపండులా మారాయన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రజల ఆస్తులు, ప్రజల సొమ్ము, ప్రజల రవాణా వ్యవస్థను కాపాడాల్సిన ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలకు లాభాల బాట వేస్తోందా? లేక నిజంగానే ఆర్టీసీ అభివృద్ధి కోసం పనిచేస్తోందా? అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. ఆర్టీసీ భవిష్యత్తును నిర్ణయించే ఈ నిర్ణయాలపై పూర్తి పారదర్శకత అవసరమని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఆర్టీసీ ప్రైవేటీకరణ




