స్మార్ట్ మీటర్లపై ఈనాడు ద్వంద్వ వైఖరి
జగన్ ప్రభుత్వ హయాంలో స్మార్ట్ మీటర్లపై విషప్రచారం.. చంద్రబాబు పాలనలో అవే మీటర్లపై ప్రశంసలు!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార పక్షానికి ఒక న్యాయం.. ప్రతిపక్షానికి మరో న్యాయం అన్నట్లుగా వ్యవహరిస్తున్న కొన్ని మీడియా సంస్థల వైఖరికి స్మార్ట్ విద్యుత్ మీటర్ల వ్యవహారమే మరో నిదర్శనంగా నిలుస్తోంది. ఒకే విధానంపై ప్రభుత్వాన్ని బట్టి వార్తల స్వరం మారిపోవడం, ఒకప్పుడు ప్రజలకు ప్రమాదకరమని చెప్పిన అంశాన్నే ఇప్పుడు ప్రజాప్రయోజనకరమని కీర్తించడం.. ఇదేనా జర్నలిజం? లేక రాజకీయ అనుకూలతకు అనుగుణంగా వార్తలకు రంగులు అద్దడమా?
స్మార్ట్ మీటర్లపై ఈనాడు ద్వంద్వ వైఖరి

జగన్ హయాంలో స్మార్ట్ మీటర్లపై పెద్ద ఎత్తున విషప్రచారం!
వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతుల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలనే నిర్ణయం రాజకీయ వివాదంగా మారింది. ఈ అంశాన్ని అడ్డుపెట్టుకుని అప్పటి ప్రతిపక్ష టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. రైతుల మెడకు ఉరితాళ్లు వేస్తున్నారంటూ ఆందోళనలు వ్యక్తం చేశారు. స్మార్ట్ మీటర్ల వల్ల రైతులకు నష్టం జరుగుతుందని ప్రచారం చేశారు.
ఈ విమర్శలకు అనుకూలంగా ఈనాడు పత్రికలోనూ వరుస కథనాలు ప్రచురితమయ్యాయి.
2022 మే 13న ‘రైతుల మెడకు ఉరితాళ్లు వేయొద్దు’ అంటూ కథనం ప్రచురితమైంది. మోటార్లకు మీటర్లు మంచివే అయితే ముందుగా మీ పొలంలో పెట్టుకోవాలంటూ అప్పటి మంత్రి పెద్దిరెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించిన మాటలకు ప్రాధాన్యత ఇచ్చింది.
2023 మే 19న ‘స్మార్ట్ మీటర్లు రైతులకు ఉరితాళ్లు’ అనే శీర్షికతో మరో కథనం వెలువడింది. స్మార్ట్ మీటర్ల ప్రయోజనం వంటగ్యాస్ రాయితీల మాదిరిగానే ఉంటుందని, ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత కల్పించింది.
ఇక 2023 మార్చి 20న ‘స్మార్ట్ మీటర్లా.. ఉరితాళ్లా?’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. రూ.6 వేల కోట్ల కుంభకోణం జరిగిందంటూ టీడీపీ సభ్యులు అసెంబ్లీలో చేసిన నినాదాలు, 11 మంది సభ్యుల సస్పెన్షన్ అంశాలను ప్రధానంగా ప్రస్తావించింది.
అంటే అప్పట్లో స్మార్ట్ మీటర్లంటే రైతులకు ప్రమాదం, ప్రభుత్వానికి కుంభకోణం, వ్యవసాయ రంగానికి నష్టం అన్నట్లుగా రాజకీయ విమర్శలు, వార్తా కథనాలు సాగాయి.
స్మార్ట్ మీటర్లపై ఈనాడు ద్వంద్వ వైఖరి
చంద్రబాబు పాలనలో మాత్రం అవే మీటర్లు ఎంతో మేలు చేస్తున్నాయట!
కాలం మారింది. ప్రభుత్వం మారింది. కానీ స్మార్ట్ మీటర్లు మారలేదు. మారింది వాటిపై కొన్ని మీడియా సంస్థలు రాస్తున్న కథనాల ధోరణి మాత్రమే!
2024 నవంబర్ 16న ఈనాడు ప్రచురించిన ‘స్మార్ట్ విద్యుత్తు మీటర్లు వచ్చేశాయ్’ అనే కథనాన్ని పరిశీలిస్తే ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది.
తొలివిడతలో ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సంస్థల్లో ప్రస్తుతం ఉన్న విద్యుత్ మీటర్ల స్థానంలో స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు కథనం వివరించింది. విద్యుత్ బిల్లుల రీడింగ్‌లో ఎదురయ్యే సమస్యలు, సకాలంలో బిల్లులు అందకపోవడం, విద్యుత్ చౌర్యం, ప్రభుత్వ కార్యాలయాల్లో బకాయిలు పేరుకుపోవడం వంటి సమస్యలను ప్రస్తావించింది.
ఈ సమస్యల పరిష్కారానికి స్మార్ట్ మీటర్లు ఉపయోగపడతాయని కథనం పేర్కొంది. విద్యుత్ వినియోగాన్ని పర్యవేక్షించడం, బిల్లింగ్ ప్రక్రియలో పారదర్శకత తీసుకురావడం వంటి ప్రయోజనాలను వివరించింది.
మరి ఇదే స్మార్ట్ మీటర్లను జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు ఈ ప్రయోజనాలన్నీ ఎందుకు కనిపించలేదు? అప్పట్లో రైతుల మెడకు ఉరితాళ్లుగా అభివర్ణించిన అంశమే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజలకు మేలు చేసే సాంకేతికతగా ఎలా మారిపోయింది?
స్మార్ట్ మీటర్లపై ఈనాడు ద్వంద్వ వైఖరి
ప్రభుత్వాన్ని బట్టి మారిపోతాయా వార్తల ప్రమాణాలు?
సాంకేతిక విధానాలపై విమర్శలు చేయడం తప్పు కాదు. ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించడం మీడియా బాధ్యతే. అయితే ఒకే విధానాన్ని ఒక ప్రభుత్వం తీసుకుంటే ప్రమాదకరమని, మరో ప్రభుత్వం అమలు చేస్తే ప్రయోజనకరమని చెప్పడం మాత్రం తీవ్రమైన ప్రశ్నలకు తావిస్తోంది.
స్మార్ట్ మీటర్ల విషయంలోనూ ఇదే సందేహం వ్యక్తమవుతోంది. జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయాల్సి వచ్చినప్పుడు రైతుల భయాలను ముందుకు తెచ్చిన కథనాలు.. చంద్రబాబు ప్రభుత్వంలో అవే మీటర్ల అమలును వివరించేటప్పుడు ప్రయోజనాలను ప్రస్తావిస్తున్నాయి.
అయితే రెండు సందర్భాల్లోనూ రైతులకు కలిగే ప్రయోజనాలు, నష్టాలు, అమలు విధానం, ప్రభుత్వ బాధ్యతలపై ఒకే స్థాయి విశ్లేషణ ఎందుకు కనిపించలేదు? రైతుల ప్రయోజనాలే నిజంగా ప్రధానమైతే, ప్రభుత్వం ఏదైనా ఒకే ప్రమాణాలతో ప్రశ్నించాల్సిన అవసరం లేదా?
స్మార్ట్ మీటర్లపై ఈనాడు ద్వంద్వ వైఖరి
ఇది స్మార్ట్ మీటర్ల వివాదం మాత్రమే కాదు.. మీడియా విశ్వసనీయతకు పరీక్ష!
ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర ప్రభుత్వాలను ప్రశ్నించడం, ప్రజలకు వాస్తవాలను అందించడం. అధికారంలో ఉన్నవారు ఎవరైనా ఒకే ప్రమాణాలతో వార్తలు రాయాలి. ప్రజలకు సంబంధించిన విధానాలపై అనుకూల, ప్రతికూల అంశాలను సమానంగా విశ్లేషించాలి.
కానీ రాజకీయంగా అనుకూలమైనప్పుడు ఒక విధానం గొప్పగా, వ్యతిరేకంగా ఉన్నప్పుడు అదే విధానం ప్రమాదకరంగా కనిపిస్తే ప్రజల్లో మీడియాపై నమ్మకం దెబ్బతినడం సహజం.
జగన్ ప్రభుత్వ హయాంలో స్మార్ట్ మీటర్లను ఉరితాళ్లుగా అభివర్ణించిన రాజకీయ నేతలు, ఇప్పుడు అదే అంశంపై తమ వైఖరిని ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. అలాగే అప్పటి కథనాలకు, ఇప్పటి కథనాలకు మధ్య ఉన్న వ్యత్యాసంపై ఈనాడు కూడా సమాధానం చెప్పాలి.
పక్కోడి పాలనలో తప్పు.. పచ్చోడి పాలనలో ఒప్పు అన్నట్లుగా వార్తల ప్రమాణాలు మారితే, అది జర్నలిజం కాదు.. రాజకీయ పక్షపాతానికి అద్దం పట్టే వైఖరి మాత్రమే!
స్మార్ట్ మీటర్లపై ఈనాడు ద్వంద్వ వైఖరి





