రాష్ట్రంలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియ మరోసారి రాజకీయ దుమారం రేపుతోంది. ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు, వారి కుటుంబ సభ్యులు, సానుభూతిపరుల పేర్లు ఓటరు జాబితా నుంచి మాయమవుతున్నాయంటూ వరుసగా ఆరోపణలు వెలువడుతున్నాయి. ఇది కేవలం పరిపాలనా లోపమా? లేక ప్రత్యర్థి పార్టీల ఓటు బ్యాంకును బలహీనపరిచే వ్యూహమా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.
ఓటర్ల పేర్లు మాయం

మాజీ ఎమ్మెల్యే కొరుముట్ల కుటుంబీకుల ఓట్లు గల్లంతు
తిరుపతి జిల్లా రైల్వేకోడూరు మండలం రెడ్డిపల్లిలో నివసిస్తున్న వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు తన తల్లి, కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లు ఓటరు జాబితాలో లేకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు.
ప్రతి గ్రామంలో వార్డుకు కనీసం 50 మంది వరకు వైఎస్సార్సీపీ సానుభూతిపరుల పేర్లను తొలగించే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రత్యర్థి పార్టీ ఓటర్లను జాబితా నుంచే తొలగించే ప్రయత్నాలు జరిగితే అది ఎన్నికల ప్రక్రియపై నమ్మకాన్ని దెబ్బతీసే చర్యగా ఆయన పేర్కొన్నారు.
ఓటర్ల పేర్లు మాయం
మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి ఆగ్రహం
“నేను 2002లో ఎమ్మెల్యేగా ఉన్నాను. కానీ నేడు నా పేరే ఓటరు జాబితాలో లేదు” అంటూ మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి తీవ్ర ఆశ్చర్యం, ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన స్వగ్రామమైన నక్కలదిన్నెలో గత రికార్డుల ప్రకారం 1,142 ఓట్లు ఉన్నప్పటికీ, ప్రస్తుతం తన కుటుంబ సభ్యుల పేర్లు మాత్రమే కాదు, గ్రామంలోని అనేక మంది పేర్లు కూడా కనిపించడం లేదని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో మరో గ్రామానికి చెందిన ఓటర్ల పేర్లు జాబితాలో చేర్చడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు.
ప్రత్యర్థి ఓట్లనే టార్గెట్ చేస్తున్నారా?
రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఒకే ప్రశ్న వినిపిస్తోంది. ప్రత్యర్థి పార్టీలకు మెజార్టీ వచ్చిన పోలింగ్ కేంద్రాలనే టార్గెట్ చేసి ఓటర్ల సంఖ్యను తగ్గించే ప్రయత్నం జరుగుతోందా?
ఒకేసారి పెద్ద ఎత్తున ఓట్లు తొలగిస్తే వెంటనే అనుమానాలు వస్తాయి. కానీ ఎవరికి తెలియకుండా, కొద్దికొద్దిగా కీలకమైన ఓట్లను తొలగిస్తే ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఓటర్ల పేర్లు మాయం
ప్రజల్లో పెరుగుతున్న ఆగ్రహం
ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి మూల స్తంభం. ఆ హక్కునే ప్రశ్నార్థకంగా మార్చే పరిణామాలు చోటుచేసుకుంటే ప్రజల్లో తీవ్ర ఆందోళన, ఆగ్రహం వ్యక్తమవడం సహజం.
ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఓటర్ల పేర్లు గల్లంతవుతున్నాయన్న ఆరోపణలపై ఎన్నికల అధికారులు తక్షణమే స్పందించి పారదర్శకంగా విచారణ జరపాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రతి ఫిర్యాదును నిష్పాక్షికంగా పరిశీలించి, నిజానిజాలను ప్రజలకు తెలియజేయాలని కోరుతున్నారు.
ఓటర్ల పేర్లు మాయం
ఓటు హక్కుతో చెలగాటం ఆడితే… ప్రజా తీర్పు ఎలా ఉంటుందో మరవొద్దు!
ఓటరు జాబితా కేవలం పేర్ల జాబితా కాదు… అది ప్రజాస్వామ్యానికి పునాది. ఒక ఓటు తొలగినా అది ఒక పౌరుడి హక్కు కోల్పోయినట్టే. ఓటర్ల పేర్లు గల్లంతవుతున్నాయన్న ఆరోపణలు మరింత తీవ్రరూపం దాల్చే ముందు సంబంధిత అధికారులు పూర్తి పారదర్శకతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. లేదంటే ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసం దెబ్బతినడమే కాకుండా, రాజకీయంగా కూడా తీవ్ర ప్రతిస్పందనలు ఎదురయ్యే పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి.
ఓటర్ల పేర్లు మాయం





