పర్యాటక అభివృద్ధి ముసుగులో ప్రభుత్వ భూముల కేటాయింపుపై తీవ్ర వివాదం
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో భారీ భూ వివాదం తిరుపతి వన్ భూ దందా ,ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ‘తిరుపతి వన్’ ప్రాజెక్టు పేరుతో రూ.1,100 కోట్లకు పైగా విలువైన 22 ఎకరాల ప్రభుత్వ భూమిని కేవలం రూ.20 కోట్లకే రెండు ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థలకు కట్టబెట్టారన్న ఆరోపణలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. పర్యాటక అభివృద్ధి పేరుతో ప్రజా సంపదను ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తున్నారంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
ఎకరం రూ.50 కోట్లకుపైగా.. కానీ కేటాయింపు మాత్రం రూ.90 లక్షలకే..?
తిరుపతిలో అత్యంత విలువైన ప్రాంతాల్లో ఉన్న ఈ భూముల మార్కెట్ ధర ఎకరానికి రూ.50 కోట్లకు పైగానే ఉంటుందని స్థానిక వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం జిల్లా కలెక్టర్ నిర్ణయించిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ధర ప్రకారం ఎకరాన్ని కేవలం రూ.90 లక్షలకే ఫ్రీహోల్డ్ విధానంలో ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేయడం వివాదాస్పదంగా మారింది.
వేలం లేదా లీజు విధానాల ద్వారా కాకుండా నేరుగా ఫ్రీహోల్డ్ హక్కులతో భూమిని ఇవ్వడం వెనుక భారీ ప్రయోజనాలు దాగి ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
‘తిరుపతి వన్’ పేరుతో రియల్ ఎస్టేట్ లాభాలా..?
చంద్రబాబు ప్రభుత్వం 2026 మార్చి 25న ‘తిరుపతి వన్’ ప్రాజెక్టు పేరుతో హైదరాబాద్, బెంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థలు దివ్యశ్రీ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కన్సార్షియంకు ఈ భూములను కేటాయించింది.
వాస్తవానికి ఈ సంస్థలకు పర్యాటక లేదా ఆతిథ్య రంగంలో పెద్దగా అనుభవం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ భారీ స్థాయిలో ప్రభుత్వ భూములు కేటాయించడంపై రాజకీయ వర్గాల్లో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తిరుపతి వన్ భూ దందా

మంత్రి పాత్రపై తీవ్ర ఆరోపణలు
తిరుపతి జిల్లా వ్యవహారాలు చూసే ఓ మంత్రి ఈ ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించారన్న ప్రచారం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. సదరు మంత్రికి రియల్ ఎస్టేట్ వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తిరుపతిపై మొదటి నుంచే కన్నేసిన ఆ మంత్రి.. పర్యాటక అభివృద్ధి పేరుతో భారీ భూములను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టే వ్యూహం అమలు చేశారన్న విమర్శలు వస్తున్నాయి.
ఎస్‌జీఎస్టీ రీయింబర్స్‌మెంట్‌తో అదనపు లాభాలు
భూముల కేటాయింపుతో పాటు ఎస్‌జీఎస్టీ రీయింబర్స్‌మెంట్, ప్రత్యేక ప్రోత్సాహకాలు కూడా ఇవ్వడం ద్వారా ప్రభుత్వానికి కంటే ప్రైవేట్ సంస్థలకే ఎక్కువ లాభం చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
పెట్టుబడికి మించి ప్రోత్సాహకాలు ఇవ్వడం వల్ల ఇది సాధారణ అభివృద్ధి ప్రాజెక్టు కాదని, భారీ స్థాయిలో భూ దందాకు మార్గం సుగమం చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రజా ఆస్తుల పరిరక్షణపై ప్రశ్నలు
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్న సమయంలో వేల కోట్ల విలువైన భూములను తక్కువ ధరలకు ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం సమంజసమేనా అనే ప్రశ్న ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది.
ప్రజల ఆస్తులను అభివృద్ధి పేరుతో ప్రైవేట్ చేతుల్లోకి పంపిస్తున్నారా..? ప్రభుత్వ విధానాలు నిజంగా ప్రజా ప్రయోజనాల కోసమేనా..? అనే సందేహాలు మరింత బలపడుతున్నాయి.
భూముల కేటాయింపా..? లేక భారీ భూ దోపిడీనా..?
‘తిరుపతి వన్’ ప్రాజెక్టు పేరుతో జరిగిన ఈ భూముల కేటాయింపు వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారం రేపుతోంది. పారదర్శకత, ప్రజా ప్రయోజనం, ప్రభుత్వ బాధ్యతలపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతున్న ఈ వివాదం రానున్న రోజుల్లో మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిరుపతి వన్ భూ దందా






