విశాఖ నుంచి అమరావతికి ఏపీ మారిటైమ్ బోర్డు.. అభివృద్ధి పేరుతో విశాఖను ఖాళీ చేస్తున్నారా?
ఒకప్పుడు పరిపాలనా రాజధాని, కార్యనిర్వాహక కేంద్రం, సముద్ర ఆర్థిక వ్యవస్థకు హబ్‌గా విశాఖను అభివృద్ధి చేస్తామని హామీలు ఇచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే కీలక సంస్థలు ఒక్కొక్కటిగా విశాఖ నుంచి తరలిపోతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా ఏపీ మారిటైమ్ బోర్డు ప్రధాన కార్యాలయాన్ని విశాఖ నుంచి అమరావతికి తరలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం మరోసారి రాజకీయ చర్చకు దారి తీసింది.
విశాఖ నుంచి అమరావతికి మారిటైమ్ బోర్డు తరలింపు

సముద్రానికి దూరంగా మారిటైమ్ బోర్డు.. ఇదేనా పరిపాలనా విజన్?
తీరప్రాంత అభివృద్ధి, పోర్టుల సమన్వయం, సముద్ర వాణిజ్య విస్తరణ కోసం గత ప్రభుత్వం ఏపీ మారిటైమ్ బోర్డును ఏర్పాటు చేసింది. అప్పటి వరకు కాకినాడలో ఉన్న పోర్టు డైరెక్టర్ కార్యాలయాన్ని కూడా 2019 నవంబర్ 22న విశాఖకు తరలించింది.
దానికి కారణాలు కూడా స్పష్టంగానే ఉన్నాయి.
- దేశంలోనే కీలకమైన విశాఖ మేజర్ పోర్టు
- ప్రైవేట్ రంగంలో పెద్దదైన గంగవరం పోర్టు
- వ్యూహాత్మకంగా కీలకమైన నావెల్ డాక్‌యార్డ్
- అభివృద్ధి చెందుతున్న మూలపేట పోర్టు
ఇన్ని సముద్ర సంబంధిత వ్యవస్థలు ఉన్న నగరాన్ని వదిలి, సముద్రానికి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న అమరావతికి మారిటైమ్ బోర్డును తరలించడం ఏ లాజిక్‌తో తీసుకున్న నిర్ణయమనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.
విశాఖ నుంచి అమరావతికి మారిటైమ్ బోర్డు తరలింపు
విశాఖకు హామీలు ఒకటి.. జరుగుతున్నది మరొకటా?
విశాఖను అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పిన ప్రభుత్వాలు, ఇప్పుడు కీలక సంస్థలను తరలించడం ద్వారా నగర ప్రాధాన్యతను క్రమంగా తగ్గిస్తున్నాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
విశాఖ ప్రజలు, సామాజిక మాధ్యమాల్లో పలువురు తీవ్రంగా స్పందిస్తున్నారు.
“పరిశ్రమలు పోతే పోయాయి… కార్యాలయాలు పోతే పోయాయి… ఇప్పుడు సముద్రానికి సంబంధించిన మారిటైమ్ బోర్డు కూడా వెళ్లిపోతోంది. మరి విశాఖకు మిగిలేదేంటి?”
అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
విశాఖ నుంచి అమరావతికి మారిటైమ్ బోర్డు తరలింపు
బారు-బీరు, క్రికెట్, యోగా డే మాత్రమేనా విశాఖ భవిష్యత్?
సోషల్ మీడియాలో కొందరు వ్యంగ్యంగా ఇలా వ్యాఖ్యానిస్తున్నారు.
“ఇక్కడ మాకు సాగరతీరంలో బారు-బీరు ఉంటే చాలు… వారానికి ఒక క్రికెట్ మ్యాచ్, ఏడాదికి ఒకసారి యోగా డే నిర్వహిస్తే చాలు… కీలక సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ వేరే ప్రాంతాలకు వెళ్లిపోవచ్చు!”
ఈ వ్యాఖ్యలు విశాఖ ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తికి ప్రతిబింబంగా కనిపిస్తున్నాయి.
విశాఖ నుంచి అమరావతికి మారిటైమ్ బోర్డు తరలింపు
సముద్రం ఉన్న విశాఖలో మారిటైమ్ బోర్డుకు చోటు లేకపోతే… ఇక విశాఖకు మిగిలిందేమిటి?
తీరప్రాంత అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఏపీ మారిటైమ్ బోర్డును సముద్ర నగరమైన విశాఖ నుంచి అమరావతికి తరలించే నిర్ణయం రాజకీయంగా, పరిపాలనా పరంగా కొత్త చర్చకు తెరతీసింది. విశాఖను అభివృద్ధి కేంద్రంగా నిలబెడతామన్న హామీల మధ్య కీలక సంస్థల తరలింపులు కొనసాగుతుండటంతో “విశాఖకు ఇచ్చిన మాటలు ఏమయ్యాయి?” అనే ప్రశ్న ఇప్పుడు మరింత బలంగా వినిపిస్తోంది.
విశాఖ నుంచి అమరావతికి మారిటైమ్ బోర్డు తరలింపు






