విశాఖలో మరో కీలక భూ వివాదం తెరపైకి వచ్చింది. సింహాచలం దేవస్థానానికి చెందిన సుమారు **160 ఎకరాల విలువైన భూములను డేటా సెంటర్ పేరుతో ప్రైవేట్ కంపెనీకి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ భూ కేటాయింపు రాజ్యాంగ విరుద్ధమని, దేవాదాయ ఆస్తులను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం చట్టబద్ధం కాదని, పర్యావరణ నిబంధనలను కూడా ఉల్లంఘించారని పిటిషనర్ బొలిశెట్టి సత్యనారాయణ ఆరోపించారు.
సింహాచలం దేవస్థానం భూముల కేటాయింపు

సింహాచలం దేవుడి భూములు ప్రైవేట్ కంపెనీకి.. కోర్టు మెట్లు ఎక్కిన పర్యావరణ వేత్త
పర్యావరణ వేత్త, జల బిరాదరి జాతీయ కన్వీనర్ బొలిశెట్టి సత్యనారాయణ హైకోర్టులో దాఖలు చేసిన పిల్లో సంచలన ఆరోపణలు చేశారు.
విశాఖలోని అడవివరం సర్వే నంబర్ 275, ముడసర్లోవ సర్వే నంబర్ 26 పరిధిలో ఉన్న సింహాచలం దేవస్థానానికి చెందిన సుమారు 160 ఎకరాల భూమిని ‘మెసర్స్ వైజాగ్ హైపర్‌స్కేల్ డేటా సెంటర్ పార్క్ లిమిటెడ్’కు కేటాయించడాన్ని ఆయన సవాల్ చేశారు.
దేవాదాయ శాఖకు చెందిన ఆస్తులను ప్రజా ప్రయోజనం పేరుతో ప్రైవేట్ సంస్థలకు బదిలీ చేయడం చట్టబద్ధతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని పిటిషన్లో పేర్కొన్నారు.
సింహాచలం దేవస్థానం భూముల కేటాయింపు
“రాజ్యాంగానికి విరుద్ధం.. పర్యావరణ చట్టాలకు తూట్లు”
భూ కేటాయింపు కేవలం పరిపాలనా నిర్ణయం మాత్రమే కాదని, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా జరిగిందని పిటిషన్లో పేర్కొన్నారు.
పిటిషన్లో చేసిన ప్రధాన ఆరోపణలు ఇవి:
- దేవాదాయ భూముల పరిరక్షణ సూత్రాలను ఉల్లంఘించారు.
- కంబాలకొండ ఎకో-సెన్సిటివ్ జోన్ నిబంధనలను పట్టించుకోలేదు.
- పర్యావరణ పరిరక్షణ చట్టాలను ఉల్లంఘిస్తూ అనుమతులు ఇచ్చారు.
- ప్రజా ఆస్తులను ప్రైవేట్ కంపెనీకి అప్పగించడంలో పారదర్శకత పాటించలేదని ఆరోపించారు.
విశాఖకు జీవనాధారమైన ముడసర్లోవ జలాశయానికే ముప్పు?
ఈ ప్రాజెక్టు అమలైతే విశాఖ నగరానికి కీలకమైన ముడసర్లోవ జలాశయం క్యాచ్మెంట్ ప్రాంతం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని పిటిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు.
డేటా సెంటర్ నిర్మాణం కారణంగా ప్రకృతి సమతుల్యత దెబ్బతినడంతో పాటు, భవిష్యత్తులో నీటి వనరులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
సింహాచలం దేవస్థానం భూముల కేటాయింపు
హైకోర్టును కోరిన కీలక ఆదేశాలు
పిటిషన్లో హైకోర్టును ఈ క్రింది అంశాలపై జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
- డేటా సెంటర్‌కు ఇచ్చిన పర్యావరణ అనుమతులను వెంటనే రద్దు చేయాలి.
- సింహాచలం దేవస్థానం భూముల కేటాయింపును చెల్లనిదిగా ప్రకటించాలి.
- ఇప్పటికే కేటాయించిన 160 ఎకరాల భూమిని తిరిగి సింహాచలం దేవస్థానానికి అప్పగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలి.
సింహాచలం దేవస్థానం భూముల కేటాయింపు
సింహాచలం భూములపై తుది మాట హైకోర్టుదే
సింహాచలం దేవస్థానం భూముల కేటాయింపు వ్యవహారం ఇప్పుడు హైకోర్టు ముందుకు చేరడంతో ఈ వివాదం రాజకీయంగా, న్యాయపరంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. దేవాదాయ భూముల పరిరక్షణ, పర్యావరణ భద్రత, ప్రజా ఆస్తుల వినియోగం వంటి కీలక అంశాలపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
సింహాచలం దేవస్థానం భూముల కేటాయింపు






