ఒకవైపు రాష్ట్రంలో 87 వేల ఎకరాలకు పైగా దేవదాయ భూములు ఆక్రమణలో ఉన్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వేలాది వివాదాలు ఎండోమెంట్స్ ట్రిబ్యునల్‌లో పెండింగ్‌లో ఉన్నాయి. దేవాలయాల భూములను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్న తరుణంలో, ఇప్పుడు అనంతపురం జిల్లాలో పుష్పగిరి మఠానికి చెందిన 6.89 ఎకరాల భూమి విక్రయానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం కొత్త వివాదానికి తెరలేపింది. దేవుడి భూములను రక్షించాల్సిన ప్రభుత్వం… వాటిని విక్రయించడానికే ప్రాధాన్యత ఇస్తోందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
పుష్పగిరి మఠం భూమి అమ్మకం

GO RT No.789తో భూమి అమ్మకానికి అనుమతి
రెవెన్యూ (ఎండోమెంట్స్-II) శాఖ 2026 మే 19న జారీ చేసిన GO RT No.789 ద్వారా అనంతపురం జిల్లా అగ్రహారం గ్రామంలో ఉన్న పుష్పగిరి మఠం భూమి విక్రయానికి అనుమతి ఇచ్చింది.
కల్లూరు అగ్రహారం గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 259లో ఉన్న 6.89 ఎకరాల భూమిని ఈ-టెండర్-కమ్-పబ్లిక్ ఆక్షన్ విధానంలో విక్రయించేందుకు ప్రభుత్వం అనుమతించింది. దేవాదాయ శాఖ కమిషనర్ ప్రతిపాదన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు GOలో పేర్కొన్నారు.
పుష్పగిరి మఠం భూమి అమ్మకం

ఆక్రమణల నుంచి కాపాడలేక… అమ్మకమే పరిష్కారమా?
GOలో పేర్కొన్న వివరాల ప్రకారం, ఆ భూమి ఆర్థికపరంగా ఉపయోగకరంగా లేకపోవడం, పదేపదే ఆక్రమణలకు గురవుతుండటంతో విక్రయించాలని ప్రభుత్వం భావించింది.
అయితే ఇక్కడే అసలు ప్రశ్నలు మొదలవుతున్నాయి.
ఆక్రమణలను అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కాదా? భూమిని రక్షించలేకపోతే దాన్ని అమ్మేయడం పరిష్కారమా? దేవుడి ఆస్తులను కాపాడే వ్యవస్థ బలహీనపడితే రేపు మరిన్ని దేవాలయ భూములు కూడా ఇదే కారణంతో విక్రయానికి వస్తాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
పుష్పగిరి మఠం భూమి అమ్మకం
దేవుడి భూములు రక్షించడంలో వైఫల్యం… విక్రయాల్లో వేగం?
రాష్ట్రంలో 87 వేల ఎకరాలకు పైగా దేవదాయ భూములు ఆక్రమణలో ఉన్నాయని ఇప్పటికే వెల్లడైంది. వేలాది కేసులు ట్రిబ్యునల్‌లో పెండింగ్‌లో ఉన్నాయి. ట్రిబ్యునల్ చైర్మన్ పోస్టు సైతం నెలల తరబడి ఖాళీగా ఉంది.
అలాంటి పరిస్థితుల్లో ఆక్రమణలను తొలగించి భూములను తిరిగి దేవాలయాల ఆధీనంలోకి తీసుకురావాల్సిన ప్రభుత్వం, భూముల విక్రయానికి మాత్రం వేగంగా అనుమతులు ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పుష్పగిరి మఠం భూమి అమ్మకం
భూమి అమ్మితే శాశ్వత ఆదాయం వస్తుందా?
ప్రభుత్వం వాదన ప్రకారం భూమి విక్రయించి వచ్చిన మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ రూపంలో పెట్టుబడి పెడితే మఠానికి స్థిరమైన వార్షిక ఆదాయం లభిస్తుందని పేర్కొంది.
కానీ దేవాదాయ ఆస్తుల పరిరక్షణ కోసం పోరాడుతున్న వర్గాలు దీనిని వ్యతిరేకిస్తున్నాయి. భూమి ఒకసారి విక్రయిస్తే శాశ్వతంగా కోల్పోతామని, భూముల విలువ కాలక్రమేణా పెరుగుతుందని, భవిష్యత్ తరాలకు చెందిన ఆస్తులను విక్రయించడం సరైన విధానం కాదని అభిప్రాయపడుతున్నాయి.
భక్తుల ఆస్తులపై నిర్ణయాలు… భక్తుల అభిప్రాయం తీసుకున్నారా?
దేవాలయాలు, మఠాలకు చెందిన భూములు ప్రభుత్వ ఆస్తులు కావు. అవి భక్తులు, దాతలు, రాజులు దేవుడి సేవ కోసం ఇచ్చిన ఆస్తులు.
అలాంటి భూములను విక్రయించే ముందు స్థానిక భక్తులు, ధార్మిక సంస్థలు, హిందూ సంఘాల అభిప్రాయాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందా? విక్రయానికి ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించిందా? అనే ప్రశ్నలు ఇప్పుడు ముందుకు వస్తున్నాయి.
పుష్పగిరి మఠం భూమి అమ్మకం
దేవుడి భూముల భవిష్యత్తుపై పెరుగుతున్న ఆందోళన
ఒకవైపు ఆక్రమణలు… మరోవైపు విక్రయాలు… ఈ రెండు పరిణామాలు కలిపి చూస్తే దేవదాయ ఆస్తుల భవిష్యత్తుపై ఆందోళన మరింత పెరుగుతోంది.
ఆక్రమణల నుంచి భూములను రక్షించడం, వివాదాలను పరిష్కరించడం, ఆదాయ వనరులను పెంచడం వంటి చర్యలపై దృష్టి పెట్టాల్సిన సమయంలో భూముల విక్రయాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి.
పుష్పగిరి మఠం భూమి అమ్మకం
దేవుడి భూములు కాపాడలేని ప్రభుత్వం… వాటిని అమ్మే హక్కు ఎలా అడుగుతోంది?
దేవాలయ భూములు భక్తుల విశ్వాసానికి ప్రతీక. వాటిని రక్షించడం ప్రభుత్వ బాధ్యత. ఆక్రమణలను అడ్డుకోలేక, వివాదాలను పరిష్కరించలేక, చివరకు విక్రయాలనే మార్గంగా చూపడం సరైన పరిపాలనా విధానమా అనే ప్రశ్న ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. పుష్పగిరి మఠం 6.89 ఎకరాల భూమి విక్రయానికి ఇచ్చిన అనుమతి కేవలం ఒక GO కాదు… రాష్ట్రంలో దేవదాయ ఆస్తుల భవిష్యత్తుపై పెద్ద చర్చకు నాంది పలికిన నిర్ణయంగా మారుతోంది.
పుష్పగిరి మఠం భూమి అమ్మకం





