30 వేల మంది మహిళలు మిస్సింగ్ అన్న పవన్.. రెండేళ్లలో 30 మందిని అయినా వెతికారా?
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. “మళ్లీ వైసీపీ ప్రభుత్వం వస్తే ఇంట్లో ఆడపిల్లలను లాగేస్తారు” అంటూ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ విశ్లేషకులు, మహిళా సంఘాలు తీవ్ర స్థాయిలో ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
ఎన్నికల ముందు “30 వేల మంది మహిళలు కనిపించకుండా పోయారు” అంటూ రాష్ట్రవ్యాప్తంగా ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా.. ఆ కేసుల్లో ఎంత పురోగతి సాధించారన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కనీసం 30 మందిని అయినా గుర్తించారా..? వారి కుటుంబాలకు న్యాయం జరిగిందా..? అంటూ విమర్శకులు నిలదీస్తున్నారు.
పవన్ కళ్యాణ్ మహిళల వ్యాఖ్యలు

మహిళల భద్రతపై మాటలు.. చర్యలు ఎక్కడ?
మహిళల భద్రత గురించి తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న పవన్ కళ్యాణ్, తన సొంత పార్టీ నేతలపై వచ్చిన ఆరోపణల విషయంలో మాత్రం ఎందుకు మౌనం పాటిస్తున్నారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో బాధితురాలిపై నడిరోడ్డులోనే జనసేన నేత దాడి చేసిన ఘటన పెద్ద చర్చకు దారి తీసింది. ఆ ఘటనలో ఎలాంటి కఠిన చర్యలు తీసుకున్నారో చెప్పాలని రాజకీయ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.
అదేవిధంగా తిరుపతిలో జనసేన నాయకుడు కిరణ్ రాయల్‌పై వచ్చిన వివాహిత వేధింపుల ఆరోపణలపై కూడా ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ప్రశ్నిస్తున్నారు. మహిళల రక్షణపై మాట్లాడే ముందు తమ పార్టీ నేతల వ్యవహారాలపై సమాధానం చెప్పాలని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పవన్ కళ్యాణ్ మహిళల వ్యాఖ్యలు
వైసీపీ హయాంలో మహిళలకు భారీ సంక్షేమం
మరోవైపు వైసీపీ ప్రభుత్వ హయాంలో మహిళలకు అందించిన సంక్షేమాన్ని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఐదేళ్ల కాలంలో మహిళలకు వివిధ సంక్షేమ పథకాల ద్వారా రూ.2,73,756 కోట్లకు పైగా లబ్ధి చేకూరిందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
అమ్మఒడి, వైఎస్సార్ చేయూత, ఆసరా, కాపు నేస్తం, సున్నా వడ్డీ వంటి పథకాల ద్వారా లక్షలాది మహిళలకు నేరుగా ఆర్థిక సహాయం అందిందని చెబుతున్నారు.
అలాగే 31 లక్షల మంది పేద మహిళలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం, మహిళల భద్రత కోసం దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం వంటి చర్యలను కూడా ప్రస్తావిస్తున్నారు.

రాజకీయ ఆరోపణలా..? లేక బాధ్యతాయుతమైన మాటలా..?
మహిళల అంశాన్ని రాజకీయ విమర్శల కోసం వాడుకోవడం కంటే బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. ఆధారాలు లేకుండా తీవ్రమైన వ్యాఖ్యలు చేసి ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం సరైంది కాదని అభిప్రాయపడుతున్నారు.
మహిళల భద్రతపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. ఎన్నికల ముందు చేసిన ఆరోపణలపై ఇప్పుడు సమాధానం చెప్పాలని, అధికారంలో ఉన్నవారు చర్యల ద్వారా చూపించాలని రాజకీయ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ మహిళల వ్యాఖ్యలు





