“అమరావతి ముళ్ల కంపలు” తొలగింపుకు కోట్ల రూపాయల ఖర్చు ప్రతిపాదనలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.
ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఏపీకి మరో భారమా..?
22 నెలల్లో సుమారు 3.60 లక్షల కోట్ల అప్పులతో ఆర్థికంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… ఇప్పుడు అమరావతి ప్రాంతంలోని ముళ్ల పొదల తొలగింపు పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఒకవైపు సంక్షేమ పథకాల కోతలు, ఆరోగ్యశ్రీ బకాయిలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆలస్యాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత వంటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా… మరోవైపు ముళ్ల కంపల తొలగింపుకు భారీ మొత్తాలు వెచ్చించడం సరైన ప్రాధాన్యత కాదంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.
రూ.36.50 కోట్లు చాలవా..? ఇప్పుడు రూ.40.53 కోట్లు ఎందుకు..?
అమరావతి రాజధాని ప్రాంతంలోని ముళ్ల పొదల తొలగింపు పనుల కోసం మొదట రూ.36.50 కోట్ల పరిపాలన అనుమతి ఇచ్చినట్లు సమాచారం.
తర్వాత ఈ పనుల కాంట్రాక్టు విలువను సుమారు రూ.30.81 కోట్లుగా నిర్ణయించి టెండర్లు పిలిచారు. అనంతరం ‘ఎన్‌సీసీ’ సంస్థకు పనులు అప్పగించబడినట్లు తెలుస్తోంది.
అయితే పనులు పూర్తయ్యాక వ్యయం పెరిగిందని పేర్కొంటూ… మొత్తం ఖర్చును రూ.40,53,05,978లకు పెంచాలని సీఆర్‌డీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీకి ప్రతిపాదనలు వెళ్లినట్లు సమాచారం బయటకు రావడం ఇప్పుడు వివాదాస్పదమైంది.
ఇప్పటికే ఈ ప్రతిపాదనను గతంలో జరిగిన సీఆర్‌డీఏ సమావేశంలో తోసిపుచ్చినప్పటికీ… మళ్లీ అదే అంశం తెరపైకి రావడం రాజకీయంగా చర్చకు దారితీసింది.

అమరావతి పేరుతో ఇప్పటికే వేల కోట్ల అప్పుల భారం..!
అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో ఇప్పటికే సుమారు 47 వేల కోట్ల రూపాయల వరకు అప్పులు చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
2015లో 29 గ్రామాల పరిధిలో 53,749 ఎకరాల ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించిన తర్వాత… భారీ నిర్మాణాలు, తాత్కాలిక భవనాలు, మౌలిక సదుపాయాల పనులు ప్రారంభమైనప్పటికీ… సరైన ఆర్థిక ప్రణాళిక లేకపోవడం వల్ల అనేక ప్రాజెక్టులు నత్తనడకన సాగినట్లు విమర్శలు ఉన్నాయి.
కాలక్రమేణా రాజధాని భూముల్లో ముళ్ల చెట్లు, పొదలు పెరగడంతో వాటి తొలగింపుకు ఇప్పుడు కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని అధికారులు చెబుతున్నప్పటికీ… దీనిపై ప్రజల్లో ప్రశ్నలు పెరుగుతున్నాయి.
సంక్షేమానికి కోతలు… కానీ ముళ్ల కంపలకు కోట్లా..?
ప్రస్తుతం రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ బకాయిలు పెరుగుతున్నాయి.
ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులు ఆలస్యమవుతున్నాయి.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రాథమిక మందుల కొరత ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అంతేకాదు…
నాడు-నేడు పనులు నెమ్మదించాయి.
కొన్ని మెడికల్ కాలేజీల నిర్మాణ పనులు కూడా ఆగిపోయినట్లు సమాచారం.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల అవసరాల కంటే ముళ్ల పొదల తొలగింపుకే ప్రాధాన్యత ఇస్తున్నారా..? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.


మంత్రుల విదేశీ పర్యటనల తర్వాత మరో వివాదమా..?
ఇటీవల మంత్రుల విదేశీ పర్యటనల ఖర్చులపై కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది.
“ప్రజలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో విదేశీ టూర్లు, దుబారాలు అవసరమా..?” అంటూ పలువురు విమర్శలు గుప్పించారు.
ఇప్పుడు అమరావతి ముళ్ల పొదల తొలగింపు ఖర్చుల వ్యవహారం బయటకు రావడంతో… ప్రజాధన వినియోగంపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ప్రజల ప్రశ్న ఒక్కటే..!
మెడికల్ కాలేజీల నిర్మాణాలకు నిధులు లేవని చెప్పే ప్రభుత్వం…
సంక్షేమ పథకాల అమలులో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెబుతున్న ప్రభుత్వం…
ఇప్పుడు ముళ్ల కంపల తొలగింపుకు మాత్రం కోట్లాది రూపాయలు ఎలా ఖర్చు చేస్తోంది..?
అమరావతి అభివృద్ధి పేరుతో జరుగుతున్న ఖర్చులు నిజంగా అవసరమా..? లేక ప్రజాధన దుర్వినియోగమా..? అనే ప్రశ్న ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది.




