అమరావతి రాజధాని పేరుతో భూములు ఇవ్వని రైతులను ఇప్పటికీ లక్ష్యంగా చేసుకుంటున్నారా? తమ భూములను కాపాడుకోవాలని నిలబడిన రైతులపై రాజకీయ కక్షతో దాడులు జరుగుతున్నాయా? గుంటూరు జిల్లా పెనుమాకలో చోటుచేసుకున్న ఘటన ఇప్పుడు ఇదే ప్రశ్నలను లేవనెత్తుతోంది. పోలీసుల సమక్షంలోనే రైతులు, రైతు పరిరక్షణ కమిటీ నేతలు ప్రయాణిస్తున్న కారుపై రాళ్లు, కర్రలతో దాడి జరగడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ప్రజాస్వామ్యంలో అభిప్రాయం చెప్పినందుకు దాడులు ఎదుర్కోవాల్సిందేనా అనే ప్రశ్న మరోసారి ముందుకు వచ్చింది.
పెనుమాక రైతులపై దాడి

పోలీసుల ముందే పచ్చ గూండాల దాడి… కారు ధ్వంసం
పెనుమాకలో రైతు పరిరక్షణ కమిటీ నేతలు, స్థానిక రైతులు వెళ్తున్న కారును అడ్డుకుని టీడీపీ కార్యకర్తలు రాళ్లు, కర్రలతో దాడి చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దాడిలో కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పరిస్థితిని అదుపు చేయాల్సిన పోలీసుల సమక్షంలోనే ఈ ఘటన జరగడం మరింత సంచలనంగా మారింది.
రాళ్ల దాడిలో విధులు నిర్వహిస్తున్న కొందరు పోలీసులకు కూడా గాయాలయ్యాయని సమాచారం. చట్టాన్ని కాపాడాల్సిన వారి ముందే దాడులు జరుగుతుంటే సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
పెనుమాక రైతులపై దాడి
మహిళలను అడ్డుగా పెట్టి… వెనుక నుంచి రాళ్ల వర్షం?
ఈ దాడి ముందస్తు ప్రణాళికతో జరిగిందని రైతు పరిరక్షణ కమిటీ నేతలు ఆరోపిస్తున్నారు. ముందువరుసలో మహిళలను నిలబెట్టి వారి చేత కోడిగుడ్లు విసిరించగా, వారి వెనుక నిలిచిన పురుషులు రాళ్లు, కర్రలతో దాడి చేశారని ఆరోపించారు. మహిళలను కవచంగా ఉపయోగించి హింసకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి అవమానమని వారు మండిపడుతున్నారు.
పెనుమాక రైతులపై దాడి
రైతులకే రక్షణ లేని రాజధాని… ప్రజలకు ఎలా భరోసా?
రాజధాని ప్రాంతంలో తరతరాలుగా నివసిస్తున్న రైతులకే భద్రత లేకపోతే, రేపు అక్కడ నివసించబోయే ప్రజలకు, పెట్టుబడిదారులకు, వ్యాపార సంస్థలకు ప్రభుత్వం ఎలాంటి భరోసా ఇస్తుంది? భూములు ఇవ్వలేదనే కారణంతో ఇప్పటికీ రైతులను శత్రువుల్లా చూడటం ప్రజాస్వామ్య పాలనా విధానమా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
రాజధాని అంటే కేవలం భవనాలు కాదు… చట్టపాలన, భద్రత, ప్రజల హక్కులకు గౌరవం కూడా ఉండాలి. కానీ పెనుమాక ఘటన ఆ నమ్మకాన్నే ప్రశ్నార్థకం చేస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి.
పెనుమాక రైతులపై దాడి
రాళ్లతో రాజధాని కాదు… ప్రజల విశ్వాసంతోనే రాజధాని నిలుస్తుంది
పెనుమాకలో జరిగిన ఘటన ఒక్క దాడి మాత్రమే కాదు… రాజధాని ప్రాంతంలో విభేదాలను ఎలా ఎదుర్కొంటున్నారనే దానికి అద్దం పడుతున్న సంఘటనగా విమర్శకులు అభివర్ణిస్తున్నారు. రైతులు తమ అభిప్రాయం చెప్పినా రాళ్లే సమాధానమైతే… అది ప్రజాస్వామ్యమా లేక రాజకీయ దౌర్జన్యమా? భూములు ఇవ్వని రైతులపై కక్షసాధింపే కొనసాగుతుందా? ఈ ఘటనపై ప్రభుత్వం, పోలీసులు స్పష్టమైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ప్రతిపక్షాలు, రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
పెనుమాక రైతులపై దాడి





