అక్రమాల ‘కోటా’.. అవినీతి ‘ఆట’!
మెగా డీఎస్సీ స్కామ్‌కు సమాధానమేది?
ఆంధ్రప్రదేశ్‌లో వేలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తుతో ముడిపడిన మెగా డీఎస్సీ–2025 నియామక ప్రక్రియ ఇప్పుడు తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో ప్రతి దశలోనూ అవకతవకలు జరిగాయంటూ బాధిత అభ్యర్థులు, నిరుద్యోగులు ఆరోపణలు చేస్తున్నారు.
ప్రశ్నాపత్రం తయారీ నుంచి పరీక్ష నిర్వహణ వరకు ఒకే వ్యవస్థకు బాధ్యతలు అప్పగించడం.. గోప్యంగా జరగాల్సిన ప్రశ్నాపత్రం అప్లోడ్ ప్రక్రియలో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పాత్ర ఉండటం.. అదే ప్రక్రియలో పనిచేసిన వ్యక్తి డీఎస్సీలో టాప్ ర్యాంక్ సాధించడం.. మొదటి మెరిట్ జాబితాలో కనిపించిన పేరు రెండో జాబితాలో మాయమవడం.. 1:1 పద్ధతిలో వెరిఫికేషన్‌కు పిలిచిన అభ్యర్థుల్లో కొందరికి అన్ని అర్హతలు ఉన్నా ఉద్యోగం రాకపోవడం.. స్పోర్ట్స్ కోటా నిబంధనలు మార్చడం.. పతకాలు లేకపోయినా ఉద్యోగాలు ఇచ్చారనే ఆరోపణలు.. పోస్టులకు రూ.15–20 లక్షల బేరసారాల ఆడియోలు బయటకు రావడం..
ఇలా ఒక్కటి కాదు.. ప్రశ్నల పరంపరే ప్రశ్నాపత్రంగా మారిన పరిస్థితి!
ఇంత జరుగుతున్నా బాధిత అభ్యర్థుల ఏ ఒక్క ప్రశ్నకూ అసెంబ్లీ వేదికగా సమగ్ర సమాధానం ఇవ్వకుండా రాజకీయ సవాళ్లు, ప్రత్యారోపణలతో వ్యవహరించడం ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది చంద్రబాబు ప్రభుత్వం.. విద్యాశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నది నారా లోకేశ్. మరి డీఎస్సీపై ఇన్ని అనుమానాలు వస్తున్నప్పుడు నిజాలు బయటకు రావాల్సిన బాధ్యత ఎవరిది?
Mega DSC 2025 Scam

డీఎస్సీ టీచర్ పోస్టుల భర్తీలో ప్రతి దశలో అవకతవకల ఆరోపణలు
మెగా డీఎస్సీ నియామక ప్రక్రియపై బాధిత అభ్యర్థులు లేవనెత్తుతున్న ప్రశ్నలు ఒక్కోటి ఒక్కో అనుమానానికి దారితీస్తున్నాయి.
- అసలు పరీక్షే లేకుండా కొందరికి టీచర్ ఉద్యోగాలు ఎలా వచ్చాయి?
- స్పోర్ట్స్ కోటా జీవోలను ఎందుకు మార్చారు?
- స్పోర్ట్స్ సర్టిఫికెట్లు ఇచ్చేది, ధ్రువీకరించేది ఒకే వర్గమైతే పారదర్శకత ఎక్కడ?
- పతకాలు లేకపోయినా కేవలం పార్టిసిపేషన్ సర్టిఫికెట్తో ఉద్యోగాలిచ్చారా?
- జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన అభ్యర్థులకు ఉద్యోగాలు ఎందుకు రాలేదు?
- ప్రశ్నాపత్రం తయారీ, పరీక్ష నిర్వహణ రెండు బాధ్యతలను ఒకే వ్యక్తి లేదా వ్యవస్థకు ఎందుకు అప్పగించారు?
- గోప్యంగా జరగాల్సిన ప్రశ్నాపత్రం తయారీ, అప్‌లోడ్‌లో ఔట్సోర్సింగ్ సిబ్బందిని ఎందుకు భాగస్వామ్యం చేశారు?
- ఆ ప్రక్రియలో పనిచేసిన వ్యక్తే డీఎస్సీలో టాప్ ర్యాంక్ ఎలా సాధించారు?
- మొదటి మెరిట్ జాబితాలో ఉన్న నవీన్ పేరు రెండోసారి విడుదల చేసిన జాబితాలో ఎందుకు కనిపించలేదు?
- టాప్ ర్యాంకర్‌కు పోస్టు ఎందుకు ఇవ్వలేదు?
- సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరు కాలేదని చెబుతున్న వ్యక్తికి కాల్ లెటర్ ఇచ్చారా?
- వెరిఫికేషన్‌కు రాలేదని చెబుతున్న వ్యక్తి కోర్టును ఎందుకు ఆశ్రయించాడు?
- కలెక్టర్ల నేతృత్వంలో సాగాల్సిన ప్రక్రియను ఎందుకు కేంద్రీకృతం చేశారు?
- 1:1 వెరిఫికేషన్‌కు పిలిచి, ధ్రువపత్రాలు సక్రమంగా ఉన్నా ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు?
- అలా అయితే వారిని రిజెక్ట్ లిస్ట్‌లో కూడా ఎందుకు చూపించలేదు?
- ‘సర్దుబాటు’ పేరుతో ఎవరికి ప్రయోజనం కల్పించారు?
- 336 కేసులు ఉన్నాయని చెబుతూ ఒక్క ఫిర్యాదు కూడా లేదని ఎలా అంటారు?
- పోస్టుల బేరసారాల ఆడియోపై కేసు నమోదైనా అసలు సూత్రధారులు ఎవరో ఎందుకు బయటకు రాలేదు?
ఇవి కేవలం రాజకీయ ప్రశ్నలా? లేక నియామక ప్రక్రియను చుట్టుముట్టిన తీవ్రమైన అనుమానాలా? ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందేనని బాధిత అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రశ్నాపత్రం తయారీ.. పరీక్ష నిర్వహణ బాధ్యతలు ఒకరికేనా?
ఏ పోటీ పరీక్షలోనైనా ప్రశ్నాపత్రం తయారీ, ప్రశ్నల అప్లోడ్, డిజిటల్ నిర్వహణ అత్యంత రహస్యంగా, కట్టుదిట్టమైన భద్రత మధ్య జరగాల్సిన ప్రక్రియ.
కానీ మెగా డీఎస్సీ విషయంలో ప్రశ్నాపత్రాల తయారీ, పరీక్ష నిర్వహణ రెండు బాధ్యతలను ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌కే అప్పగించారనే అంశం ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.
సాధారణంగా ప్రశ్నాపత్రం రూపొందించే సంస్థ, పరీక్ష నిర్వహణ బాధ్యతలు చూసే వ్యవస్థ మధ్య తగినంత విభజన ఉండాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ డీఎస్సీ కన్వీనర్‌ను పక్కనపెట్టి రెండు కీలక బాధ్యతలను ఒకే వ్యవస్థకు అప్పగించడంపై అభ్యర్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
స్కామ్‌కు బీజం పడింది ఇక్కడేనా?
ఇంకా తీవ్రమైన ప్రశ్న ఏమిటంటే.. అత్యంత గోప్యంగా జరగాల్సిన ప్రశ్నాపత్రం తయారీ, అప్లోడ్ బాధ్యతల్లో ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు భాగస్వాములు కావడం.
అవసరమైతే తరువాత తప్పును వారి మీదకు నెట్టివేయవచ్చనే ముందస్తు వ్యూహంతోనే ఈ విధానం అవలంబించారా? అన్న అనుమానాలను బాధితులు వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఆరోపణలపై ఎవరెవరికి డిజిటల్ యాక్సెస్ ఉంది? ఎవరు ప్రశ్నాపత్రాన్ని చూశారు? ఎవరు అప్లోడ్ చేశారు? యాక్సెస్ లాగ్స్ ఏమి చెబుతున్నాయి? అనే అంశాలు పూర్తిగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.
Mega DSC 2025 Scam
ఔట్సోర్సింగ్ ఉద్యోగి డీఎస్సీలో టాప్ ర్యాంకర్.. ఇదే పెద్ద ప్రశ్న!
డీఎస్సీ ప్రక్రియలో పనిచేసిన ఔట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్ కృష్ణా జిల్లా సోషల్ స్టడీస్‌లో మొదటి ర్యాంక్ సాధించారని, టీజీటీ తెలుగు పరీక్షలో జోన్–2లో ఆరో ర్యాంక్ సాధించారని బాధితులు పేర్కొంటున్నారు.
ఇక్కడే అనుమానాలు మరింత తీవ్రమవుతున్నాయి.
పరీక్ష నిర్వహణ వ్యవస్థలో పనిచేసిన వ్యక్తి.. అదే పరీక్షలో టాప్ ర్యాంకులు సాధించడం ఎలా జరిగింది?
నిజంగానే అతను తన ప్రతిభతో ర్యాంక్ సాధించి ఉంటే అభినందించాల్సిందే. కానీ అతనికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు?
విద్యాశాఖ విడుదల చేసిన మొదటి మెరిట్ జాబితాలో నవీన్‌కు ఫస్ట్ ర్యాంక్ కనిపించిందని, తరువాత విడుదలైన మెరిట్ జాబితాలో అతని వివరాలు కనిపించలేదని అభ్యర్థులు చెబుతున్నారు.
మొదటి జాబితాలో పేరు ఎలా వచ్చింది? రెండో జాబితాలో ఎందుకు మాయమైంది? లాగిన్ ఐడీ, అభ్యర్థి డేటా ఎందుకు కనిపించలేదు? కాల్ లెటర్ ఎందుకు ఇవ్వలేదు?
ఈ ప్రశ్నలకు సమాధానం లేకుండా ‘వెరిఫికేషన్‌కు రాలేదు’ అని చెప్పడం ద్వారా వివాదం ముగిసిపోదని బాధితులు అంటున్నారు.
Mega DSC 2025 Scam
‘వెరిఫికేషన్‌కు రాలేదు’.. మరి కాల్ లెటర్ ఏది?
మొదటి ర్యాంక్ సాధించిన అభ్యర్థి ధ్రువపత్రాల పరిశీలనకు రాలేదని, అందుకే ఉద్యోగం ఇవ్వలేదని చెప్పిన వాదనపై బాధితులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
అభ్యర్థి డేటాను తొలగించారు.. మెరిట్ జాబితా నుంచి పేరు తొలగించారు.. కాల్ లెటర్ ఇవ్వలేదు.. మరి ధ్రువపత్రాల పరిశీలనకు ఎలా వస్తాడు?
అసలు వెరిఫికేషన్‌కు హాజరు కాలేదని చెబుతున్న వ్యక్తి కోర్టును ఎందుకు ఆశ్రయించాడు?
అతను కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌ను పరిశీలిస్తే వాస్తవ పరిస్థితి బయటపడుతుందని బాధితులు చెబుతున్నారు.
అందుకే ఇప్పుడు ప్రశ్న ఒక్కటే:
వెరిఫికేషన్‌కు రాలేదా? లేక వెరిఫికేషన్‌కు వచ్చే అవకాశమే కల్పించలేదా?
ఈ రెండింటిలో నిజం ఏదో అధికారిక రికార్డులు చెప్పాలి.
Mega DSC 2025 Scam
కలెక్టరేట్లు డమ్మీ.. పారదర్శకత ఎక్కడ?
గతంలో డీఎస్సీ ప్రక్రియ జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో జరిగేదని అభ్యర్థులు గుర్తుచేస్తున్నారు.
కానీ మెగా డీఎస్సీలో కలెక్టరేట్లు డమ్మీ అయ్యాయని వారు ఆరోపిస్తున్నారు.
మెరిట్ జాబితాలు లేవు.. మార్కులు లేవు.. ర్యాంకులు లేవు.. కటాఫ్ మార్కులు లేవు.. బహిరంగంగా జాబితాలు ప్రదర్శించలేదు.
ఎంపికైన అభ్యర్థులకు మాత్రమే మెసేజ్‌లు పంపించే కొత్త విధానం తీసుకొచ్చారని అభ్యర్థులు చెబుతున్నారు.
అయితే ప్రభుత్వ నియామక ప్రక్రియలో ‘పబ్లిక్ డిస్ప్లే’ లేకపోతే పారదర్శకత ఎలా నిర్ధారించాలి?
సమస్యలతో కలెక్టరేట్లకు వెళ్లిన అభ్యర్థులకు ‘పైకి వెళ్లండి.. మాకు సంబంధం లేదు’ అనే పరిస్థితి ఎదురైందని వారు ఆరోపిస్తున్నారు.
ఆన్లైన్ పేరుతో మొత్తం ప్రక్రియను కేంద్రీకరించాల్సిన అవసరం ఏమొచ్చింది? జిల్లా స్థాయిలో బాధ్యతలు ఎందుకు తగ్గించారు? అనే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వాల్సి ఉంది.
Mega DSC 2025 Scam
1:1లో పిలిచి.. అన్నీ సక్రమంగా ఉన్నా ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు?
ఒక పోస్టుకు ఒక అభ్యర్థి చొప్పున 1:1 విధానంలో కాల్ లెటర్లు పంపించారు.
మెరిట్, రోస్టర్ ఆధారంగా ధ్రువపత్రాల పరిశీలన చేపట్టారు. అభ్యర్థి ఎన్ని మార్కులు సాధించాడు? ఓపెన్ కేటగిరీలోకి వస్తాడా? రిజర్వేషన్ కేటగిరీలోకి వస్తాడా? ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, మహిళలు, స్పోర్ట్స్, మాజీ సైనికులు వంటి కేటగిరీల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయన్నది ముందే నిర్ణయించబడుతుంది.
అందుకే 1:1 విధానంలో పిలిచారు.
మరి ధ్రువపత్రాలు అన్నీ సక్రమంగా ఉన్నట్లు తేలిన అభ్యర్థులకు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు?
ఇంకా విచిత్రం ఏమిటంటే.. ఉద్యోగం ఇవ్వకపోతే రిజెక్ట్ లిస్ట్‌లో ఎందుకు చూపించలేదు?
ప్రశ్నిస్తే ‘సర్దుబాటు’ అనే సమాధానం వస్తోందని బాధితులు అంటున్నారు.
ఎవరి కోసం ఈ సర్దుబాటు? ఎవరిని సర్దుబాటు చేశారు? ఎవరి స్థానంలో ఎవరిని తీసుకున్నారు?
ఈ ప్రశ్నలకు సమాధానం లేకుండా నియామక ప్రక్రియపై అనుమానాలు ఎలా తొలగుతాయి?
Mega DSC 2025 Scam
స్పోర్ట్స్ కోటా.. మెగా డీఎస్సీలో మరో పెద్ద వివాదం!
మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా మరో పెద్ద వివాదంగా మారింది.
గతంలో 2 శాతంగా ఉన్న క్రీడా కోటాను 3 శాతానికి పెంచుతూ జీవో నంబర్ 4, జీవో నంబర్ 47 తీసుకొచ్చారని అభ్యర్థులు పేర్కొంటున్నారు.
డీఎస్సీ, టెట్ పరీక్షలు రాయకుండానే కేవలం క్రీడా ధ్రువపత్రాల ఆధారంగా ఉద్యోగాలు ఇచ్చేలా నిబంధనల్లో మార్పులు చేశారని ఆరోపిస్తున్నారు.
కొన్ని పోస్టులకు ఉద్యోగం వచ్చిన తరువాత ఐదేళ్లలో డిగ్రీ పూర్తి చేసి ధ్రువపత్రం సమర్పించవచ్చనే మినహాయింపులు కూడా ఇచ్చారని చెబుతున్నారు.
ఇక అనుకున్న వారికి పోస్టులు ఇచ్చిన తరువాత మళ్లీ నిబంధనలు మార్చి పాత జీవోలను రద్దు చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
నిజంగా ఇవి మంచి జీవోలు అయితే ఎందుకు రద్దు చేశారు?
ఈ ప్రశ్నకు కూడా స్పష్టమైన సమాధానం రావాల్సి ఉంది.
Mega DSC 2025 Scam
పతకాలు లేకపోయినా ఉద్యోగాలా? కేవలం పార్టిసిపేట్ చేస్తే చాలనా?
క్రీడాకారుల ప్రతిభను చూడలేదని.. ఫలితాలను చూడలేదని.. పతకాలను చూడలేదని.. కేవలం ఆటల్లో పాల్గొన్న ధ్రువపత్రం ఉంటే సరిపోతుందనే విధంగా నియామకాలు జరిగాయని బాధితులు ఆరోపిస్తున్నారు.
వారి లెక్కల ప్రకారం:
- బాల్ బ్యాడ్మింటన్‌లో 48 మందికి ఉద్యోగాలు
- ఖోఖోలో 49 మందికి
- జూడోలో 39 మందికి
- సాఫ్ట్‌బాల్‌లో 38 మందికి
- ఫెన్సింగ్‌లో 13 మందికి
ఉద్యోగాలు వచ్చాయి.
మొత్తం 270 మందికి పతకాలు లేకపోయినా కేవలం పాల్గొన్నందుకే ఉద్యోగాలు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి.
అంతర్ కళాశాల పోటీల్లో పాల్గొన్న 99 మందికి ఉద్యోగాలు రాగా, వారిలో 86 మందికి పతకాలు, ట్రోఫీలు లేవని పేర్కొంటున్నారు.
అంతర్ జిల్లా పోటీల్లో 59 మందికి ఉద్యోగాలు రాగా, వారిలో 18 మందికి కేవలం పాల్గొన్నందుకే ఉద్యోగాలు వచ్చాయని ఆరోపిస్తున్నారు.
అయితే మరోవైపు జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన అభ్యర్థులకు ఉద్యోగాలు ఎందుకు రాలేదన్న ప్రశ్న మరింత తీవ్రమవుతోంది.
పతకం సాధించినవాడికి ఉద్యోగం లేదు.. పాల్గొన్నవాడికి ఉద్యోగం ఉంది.. అసలు ప్రమాణం ఏమిటి?
Mega DSC 2025 Scam
ధ్రువపత్రాలు ఇచ్చేదీ.. ధ్రువీకరించేదీ.. ఉద్యోగాలిచ్చేదీ వారేనా?
సాఫ్ట్‌బాల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్, జూడో సంఘం అధ్యక్షుడిగా విశాఖ ఎంపీ భరత్ ఉన్నారని బాధితులు పేర్కొంటున్నారు.
ఇక్కడే మరో తీవ్రమైన ప్రశ్న:
ధ్రువపత్రాలు ఇచ్చేది ఒకే వర్గం.. వాటిని ధ్రువీకరించేది కూడా అదే వర్గమైతే.. నియామకంలో స్వతంత్ర తనిఖీ ఎక్కడ?
నిజమైన క్రీడాకారుల ప్రతిభను పక్కనబెట్టి కేవలం పాల్గొన్న ధ్రువపత్రాల ఆధారంగా ఉద్యోగాలు ఇస్తే, జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన వారికి అన్యాయం జరగదా?
క్రీడా ధ్రువపత్రాల జారీ, ధ్రువీకరణ, నియామక ప్రక్రియ మధ్య పూర్తి పారదర్శకత ఉందని ప్రభుత్వం ఆధారాలతో నిరూపించాల్సిన అవసరం ఉంది.
Mega DSC 2025 Scam
ఒక్కో స్పోర్ట్స్ పోస్టుకు రూ.15–20 లక్షల బేరసారాల ఆరోపణలు!
స్పోర్ట్స్ కోటా పోస్టులకు ఒక్కో పోస్టుకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు బేరసారాలు జరిగాయంటూ ఆడియో రికార్డులు బయటకు వచ్చాయని బాధితులు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వ చిహ్నాన్ని ప్రొఫైల్ ఫొటోగా పెట్టుకున్న వ్యక్తి ఒక అభ్యర్థితో మాట్లాడిన ఆడియో బయటపడిందని పేర్కొంటున్నారు.
ఈ వ్యవహారంపై కేసు నమోదై, స్టేషన్ బెయిల్‌తో వదిలేశారని చెబుతున్నారు.
మరి అసలు ప్రశ్న:
వీడియో కాల్ చేసిన వ్యక్తి ఫోన్ నంబర్ స్పష్టంగా ఉన్నప్పుడు ఎఫ్ఐఆర్లో పేరు ఎందుకు వెల్లడించలేదు? కేవలం అనుమానితుడిగా ఎందుకు పేర్కొన్నారు?
ఈ కేసు దర్యాప్తు ఎక్కడికి వచ్చింది? డబ్బుల బేరసారాల వెనుక ఎవరు ఉన్నారు? ఎవరికి డబ్బులు వెళ్లాయి? ఎవరు పోస్టులు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు?
ఇవి తేలకపోతే బేరసారాల ఆరోపణలపై అనుమానాలు ఎలా తొలగుతాయి?
Mega DSC 2025 Scam
336 కేసులు.. ఒక్క ఫిర్యాదు కూడా లేదా?
మెగా డీఎస్సీపై 336 కేసులు నమోదయ్యాయని చెబుతూనే.. ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని చెప్పడం ఎలా సాధ్యం? అని బాధితులు ప్రశ్నిస్తున్నారు.
కోర్టులను ఆశ్రయించిన అభ్యర్థులు ఉన్నారు. అఫిడవిట్లు దాఖలు చేసినవారు ఉన్నారు. నియామక ప్రక్రియపై బహిరంగంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నవారు ఉన్నారు.
అయితే ‘ఫిర్యాదులు లేవు’ అనే వాదన ఎందుకు?
కోర్టుల్లో ఉన్న కేసుల పూర్తి వివరాలు, ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలు, అభ్యర్థులు లేవనెత్తిన అభ్యంతరాలను ప్రజల ముందుంచితేనే ఈ వివాదంపై స్పష్టత వస్తుంది.
Mega DSC 2025 Scam
లోకేశ్ సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు ఇవే!
డీఎస్సీపై బాధిత అభ్యర్థులు లేవనెత్తుతున్న ప్రశ్నలు ఒక్కటే కాదు. అనేకం.
ప్రశ్నాపత్రం తయారీలో ఎవరెవరు ఉన్నారు?
డిజిటల్ యాక్సెస్ ఎవరెవరి చేతుల్లో ఉంది?
ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందా?
లీక్ అయితే ఎంతమందికి చేరింది?
లీకైన ప్రశ్నాపత్రం పొందిన వారు ఎంతమంది పరీక్ష రాశారు?
ఎంతమంది ద్వారా సమాచారం బయటకు వెళ్లింది?
ఎంతమొత్తంలో ముడుపులు చేతులు మారాయి?
ఔట్సోర్సింగ్ ఉద్యోగికి టాప్ ర్యాంక్ ఎలా వచ్చింది?
మొదటి మెరిట్ జాబితాలో ఉన్న పేరు రెండో జాబితాలో ఎందుకు మాయమైంది?
కాల్ లెటర్ ఎందుకు ఇవ్వలేదు?
వెరిఫికేషన్‌కు రాలేదని చెబుతున్న వ్యక్తి కోర్టుకు ఎందుకు వెళ్లాడు?
1:1 వెరిఫికేషన్ తర్వాత ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు?
రిజెక్ట్ లిస్ట్‌లో ఎందుకు చూపించలేదు?
ఎవరి కోసం ‘సర్దుబాటు’ చేశారు?
స్పోర్ట్స్ కోటా జీవోలు ఎందుకు మార్చారు?
పతకాలు లేకపోయినా ఉద్యోగాలు ఎందుకు ఇచ్చారు?
జాతీయ పతక విజేతలకు ఉద్యోగాలు ఎందుకు రాలేదు?
రూ.15–20 లక్షల బేరసారాల ఆరోపణల వెనుక సూత్రధారులు ఎవరు?
336 కేసులపై ప్రభుత్వం పూర్తి వివరాలు ఎందుకు వెల్లడించదు?
ఇవి బాధిత అభ్యర్థుల ప్రశ్నలు. వీటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.
Mega DSC 2025 Scam
‘స్కామ్‌కు ఇవన్నీ సాక్ష్యాలు కాదా?’.. సీబీఐ విచారణకు డిమాండ్
పరీక్ష నిర్వహణ వ్యవస్థలో పనిచేసిన వ్యక్తి అదే పరీక్షలో టాప్ ర్యాంకులు సాధించడం.. మొదటి మెరిట్ జాబితాలో పేరు రావడం.. తరువాత పేరు కనిపించకపోవడం.. కీలక డేటా అందుబాటులో లేకపోవడం.. కాల్ లెటర్‌పై వివాదం.. 1:1 వెరిఫికేషన్ అనంతరం ఉద్యోగాలు ఇవ్వకపోవడం.. స్పోర్ట్స్ కోటా నిబంధనల్లో మార్పులు.. పతకాలు లేని వారికి ఉద్యోగాల ఆరోపణలు.. పోస్టుల బేరసారాల ఆడియోలు..
ఇవన్నీ కలిపి చూస్తే సమగ్ర దర్యాప్తు అవసరం లేదా? అని బాధిత అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.
ఈ ఆరోపణల్లో నిజం ఎంత? రాజకీయ ఆరోపణలు ఎంత? వాస్తవాలు ఏమిటి? అనేది తేల్చడానికి స్వతంత్ర సంస్థతో విచారణ జరగాలని వారు కోరుతున్నారు.
అందుకే సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని బాధిత అభ్యర్థులు, నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
Mega DSC 2025 Scam
‘లోకేశ్ సమాధానం చెప్పకుండా సవాళ్లు ఎందుకు?’
డీఎస్సీపై కీలక ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా సవాళ్లు విసరడం, సభా వేదికగా వ్యక్తిగత విమర్శలకు దిగడం సరికాదని బాధిత అభ్యర్థులు తప్పుబడుతున్నారు.
ప్రశ్న అడిగితే సమాధానం చెప్పాలి.. సవాలు విసరడం కాదు.
డీఎస్సీ అనేది రాజకీయ పార్టీకి చెందిన ఆస్తి కాదు. వేలాది కుటుంబాల భవిష్యత్తుతో ముడిపడిన ప్రభుత్వ నియామక ప్రక్రియ.
అందుకే అభ్యర్థులు తమకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. నియామక ప్రక్రియలో అక్రమాలు రుజువైతే నైతిక బాధ్యత వహించాల్సిందేనని, బాధ్యత వహిస్తూ లోకేశ్ రాజీనామా చేయాలని కూడా వారు కోరుతున్నారు.
ముగింపు: డీఎస్సీకి సమాధానం కావాలి.. ఆరోపణలకు కాదు!
మెగా డీఎస్సీ–2025పై వచ్చిన ప్రతి ఆరోపణ నిజమేనని ముందుగానే తీర్పు చెప్పడం ఎంత తప్పో.. వాటిని కొట్టిపారేసి బాధితుల ప్రశ్నలను మూసివేయడం కూడా అంతే తప్పు.
కానీ ఇక్కడ ఒక విషయం మాత్రం స్పష్టం — ప్రశ్నలు చాలా ఉన్నాయి. సమాధానాలు మాత్రం ఇంకా పూర్తిగా లేవు.
ప్రశ్నాపత్రం తయారీ నుంచి డిజిటల్ అప్లోడ్ వరకు.. ఔట్సోర్సింగ్ ఉద్యోగి టాప్ ర్యాంక్ నుంచి మెరిట్ జాబితా మార్పు వరకు.. కాల్ లెటర్ నుంచి 1:1 వెరిఫికేషన్ వరకు.. స్పోర్ట్స్ కోటా జీవోల నుంచి పతకాలు లేని అభ్యర్థుల నియామకాల వరకు.. బేరసారాల ఆడియోల నుంచి 336 కేసుల వరకు..
ప్రతి అంశంపైనా పత్రాలతో, ఆధారాలతో, అధికారిక లెక్కలతో సమాధానం రావాలి.
నిజంగా డీఎస్సీ ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు జరగకపోతే ప్రభుత్వం పూర్తి వివరాలను ప్రజల ముందుంచి అనుమానాలను నివృత్తి చేయాలి. అక్రమాలు జరిగి ఉంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
ఎందుకంటే ఇది కేవలం ఒక పరీక్ష కాదు.. వేలాది నిరుద్యోగుల జీవితాల ప్రశ్న.
బాధితుల గొంతుకకు సమాధానం కావాలి.
మెరిట్‌కు న్యాయం కావాలి.
నియామకాల్లో పారదర్శకత కావాలి.
ఆరోపణలకు స్వతంత్ర విచారణ కావాలి.
మెగా డీఎస్సీపై చివరి మాట రాజకీయ నేతలది కాదు.. ఆధారాలది కావాలి.
అందుకే బాధితుల డిమాండ్ ఒక్కటే — సమగ్ర, నిష్పక్షపాత విచారణ జరపండి.. నిజాలను బయటపెట్టండి!







