రాజకీయాల్లో అభిమానాలు ఉండొచ్చు.. పార్టీ విధేయత ఉండొచ్చు.. కానీ చట్టం కంటే ఎవరూ పెద్దవారు కాదు. సామాన్యుడిపై కేసు పడితే వెంటనే “క్రిమినల్” ముద్ర వేసే కొందరు.. అదే ఆరోపణలు, అదే కేసులు, అదే కోర్టు పోరాటాలు ఒక పెద్ద నాయకుడి విషయంలో ఉంటే మాత్రం ఆయనకు రక్షణ కవచంలా నిలబడుతున్నారు.
అసలు ప్రశ్న ఇదే… సామాన్యుడికి ఒక న్యాయం.. అధికారంలో ఉన్నవారికి మరో న్యాయమా?
ఎవరు క్రిమినల్స్ ఎవరు నిప్పులు

కేసుల చరిత్ర.. స్టేల పరంపర.. రాజకీయ ప్రశ్నలు
దశాబ్దాలుగా అక్రమాస్తులు, భూవ్యవహారాలు, ఆర్థిక అవకతవకలు తదితర అంశాలపై పలు సందర్భాల్లో వివిధ వ్యక్తులు కోర్టులను ఆశ్రయించారు. ప్రతి ఆరోపణ నిజమా కాదా అనేది పక్కన పెడితే.. ఇన్ని కేసులు, ఇన్ని వివాదాలు, ఇన్ని కోర్టు పోరాటాలు ఒక నాయకుడి చుట్టూ తిరగడం మాత్రం రాజకీయంగా ఎప్పటికీ ప్రశ్నార్థకంగానే మిగిలిపోతుంది.
కోర్టుల నుంచి స్టేలు పొందడం చట్టబద్ధమైన హక్కే. కానీ స్టే తెచ్చుకున్నంత మాత్రాన ఆరోపణలు చరిత్ర నుంచి చెరిగిపోవు. ప్రశ్నలు అడిగిన వారందరూ తప్పు.. ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి మాత్రమే పవిత్రుడు అన్న వాదన ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం.
సామాన్యుడికి క్రిమినల్ ముద్ర.. నాయకుడికి నిర్దోషి సర్టిఫికెట్టా?
ఒక పేదవాడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కితే చాలు.. అతడిని అనుమానితుడిగా చూస్తారు. లాకప్ డెత్ జరిగితే కూడా బాధితుడి గతం తవ్వడం మొదలుపెడతారు. వేధింపులకు గురైన కుటుంబాలకు అండగా నిలబడటానికి ముందుకు రారు.
కానీ పెద్ద నాయకుడిపై కేసులు వస్తే మాత్రం వీధుల్లో పడుకుని నిరసనలు.. సోషల్ మీడియాలో ప్రచారాలు.. అతడిని కాపాడేందుకు సైన్యాల్లా మారిపోతారు.
ఇదే ద్వంద్వ వైఖరి కాదా?
ఎవరు క్రిమినల్స్ ఎవరు నిప్పులు
చట్టం ముందు అందరూ సమానమే కదా?
ఒకరిని “క్రిమినల్” అని పిలవాలంటే.. మరొకరిని “నిప్పు” అని కీర్తించాలంటే.. దానికి ప్రమాణం రాజకీయ అభిమానం కాదు.. చట్టం.
ఎవరైనా నిర్దోషి అయితే కోర్టులు చెబుతాయి. ఎవరైనా తప్పు చేసి ఉంటే కూడా కోర్టులే చెబుతాయి. కానీ కోర్టు తీర్పు రాకముందే ఒకరికి శిక్ష విధించి.. మరొకరికి పవిత్రత సర్టిఫికెట్ ఇవ్వడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం.
ఎవరు క్రిమినల్స్ ఎవరు నిప్పులు
పల్లకీ మోసే ముందు ఒక్కసారి ఆలోచించండి!
సామాన్యుడి విషయంలో న్యాయం కోరుతూ.. పెద్దల విషయంలో కూడా అదే ప్రమాణాలు పాటించాలి. కేసులు ఉన్నవారిని ప్రశ్నించడం నేరం కాదు. అధికారాన్ని నిలదీయడం ప్రజాస్వామ్య హక్కు.
సామాన్యుడిని కేసులతో కొలిచి క్రిమినల్ అంటుంటే… ఇన్ని ఆరోపణలు, ఇన్ని వివాదాలు, ఇన్ని స్టేల మధ్య ఉన్న నాయకుడిని ప్రశ్నించిన వారిని తప్పుబట్టే నైతిక హక్కు ఎవరికుంది?
ఎవరు క్రిమినల్స్..? ఎవరు నిప్పులు..? తీర్పు చెప్పేది అభిమానులు కాదు… చివరికి చెప్పాల్సింది న్యాయస్థానాలే.
ఎవరు క్రిమినల్స్ ఎవరు నిప్పులు





