పవన్ కళ్యాణ్ అమరావతి భూసేకరణ
2018లో అమరావతి పేరుతో బలవంతపు భూసేకరణను తీవ్రంగా వ్యతిరేకించిన జనసేనాని.. నేడు అదే అమరావతి పేరుతో మరో విడత భూసేకరణ జరుగుతున్న వేళ ఎందుకు ప్రశ్నించడం లేదు?
2018లో అమరావతి పేరుతో జరుగుతున్న భూసేకరణపై గళమెత్తిన పవన్ కళ్యాణ్ మాటలు ఇప్పుడు ఎక్కడికి పోయాయి? అప్పట్లో రైతుల తరఫున, ప్రజల తరఫున పోరాటం చేస్తానని ప్రకటించిన జనసేనాని.. నేడు అదే రాజధాని పేరుతో మరో విడత భూసేకరణ జరుగుతున్నప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? ప్రజాధనం భారీగా ఖర్చవుతున్నా, అభివృద్ధి సంక్షేమ రంగాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని విమర్శలు వస్తున్నా.. నాటి ఆగ్రహం నేడు కనిపించకపోవడం రాజకీయంగా ప్రశ్నలను లేవనెత్తుతోంది.
పవన్ కళ్యాణ్ అమరావతి భూసేకరణ

నాడు చంద్రబాబుపై పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు
2018 జూలై 28న విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో “2013 భూసేకరణ చట్ట పరిరక్షణ సదస్సు” నిర్వహించారు. ఆ సమావేశంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి నిర్మాణం పేరుతో చేపడుతున్న భూసేకరణపై పవన్ కళ్యాణ్ తీవ్రంగా మండిపడ్డారు.
రాజధాని నిర్మాణం కోసం తొలుత 1,850 ఎకరాలు అవసరమని చెప్పారని, కానీ ఇప్పుడు భూసేకరణ లక్ష ఎకరాల స్థాయికి చేరుతున్న తీరు ఏమిటని ఆయన ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన అభివృద్ధి చేయలేరా అంటూ ప్రభుత్వ తీరును నిలదీశారు. పర్యావరణాన్ని నాశనం చేసే అభివృద్ధి వల్ల కలిగే నష్టాలను కూడా ఆయన ప్రస్తావించారు.
పవన్ కళ్యాణ్ అమరావతి భూసేకరణ
“ప్రజలు చూస్తున్నారు.. తోలు తీస్తారు” అంటూ హెచ్చరిక
అప్పట్లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి.
“పిచ్చి, పిచ్చి నిర్ణయాలు తీసుకుంటే చూస్తూ ఊరుకోం. ఏం అడిగేవాళ్లు లేరనుకుంటున్నారా? ప్రజలు గమనిస్తున్నారు.. తోలు తీస్తారు గుర్తు పెట్టుకోండి.”
భూ దోపిడీపై న్యాయపరమైన, రాజకీయపరమైన, ప్రజా ఉద్యమాలు చేస్తామని ప్రకటించారు. మహారాష్ట్ర తరహాలో రైతు ఉద్యమాలు చేపడతామని, అవసరమైతే ముఖ్యమంత్రి ఇంటి ముందు కూర్చుంటామని, అమరావతి నిర్మాణాన్ని అడ్డుకుంటామని కూడా వ్యాఖ్యానించారు. కేసులు పెట్టినా ఎదురుతిరగాలని, రైతులకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
ఆ సమావేశంలో మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, సీపీఐ, సీపీఎం నేతలు, పలువురు ప్రముఖులు, మేధావులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన భూసేకరణ బాధితులు కూడా తమ ఆందోళనను వ్యక్తం చేశారు.
పవన్ కళ్యాణ్ అమరావతి భూసేకరణ
ఇప్పుడు మరో విడత భూసేకరణ.. నాటి పోరాట స్ఫూర్తి ఏమైంది?
ఇప్పుడు అదే అమరావతి పేరుతో మరో విడత భూసేకరణ జరుగుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నాటి మాటలను గుర్తుచేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రాధాన్యత తగ్గించి, రాజధాని నిర్మాణంపై భారీగా ప్రజాధనం కేంద్రీకరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రం అప్పుల భారంతో ముందుకు సాగుతున్న వేళ, అమరావతి నిర్మాణానికి భారీ వ్యయంతో ప్రాజెక్టులు చేపడుతున్న ప్రభుత్వ విధానంపై ప్రశ్నలు వస్తున్నాయి. చదరపు అడుగు నిర్మాణానికి వేలాది రూపాయల ప్రజాధనం ఖర్చు చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు తొలివిడత భూములు ఇచ్చిన రైతుల సమస్యలు పూర్తిగా పరిష్కారం కాలేదని, తమ హక్కుల కోసం రైతులు ఇంకా ఉద్యమిస్తున్నారని విమర్శకులు పేర్కొంటున్నారు.
పవన్ కళ్యాణ్ అమరావతి భూసేకరణ
నాడు రైతుల కోసం మైకులు పట్టారు.. నేడు ఎందుకు ప్రశ్నించడం లేదు?
2018లో రైతుల హక్కుల కోసం, భూసేకరణలో అన్యాయం జరగకుండా అడ్డుకుంటామని గట్టిగా ప్రకటించిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు అధికారంలో భాగస్వామిగా ఉన్న సమయంలో అదే అంశాలపై ఎందుకు ప్రశ్నించడం లేదన్నది రాజకీయంగా కీలక ప్రశ్న.
అమరావతి నిర్మాణం తప్పు అని నాడు చెప్పారా? లేక బలవంతపు భూసేకరణ, పర్యావరణ విధ్వంసం, ప్రజాధనం దుర్వినియోగం తప్పని చెప్పారా? అప్పటి విమర్శలు చంద్రబాబు ప్రభుత్వ విధానాలపై మాత్రమేనా? లేక భూసేకరణ విధానంపై సూత్రప్రాయమైన అభ్యంతరాలా? ఇప్పుడు ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.
రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి, సంక్షేమం, మౌలిక వసతులకు ప్రాధాన్యత ఇవ్వకుండా రాజధాని ప్రాంతంలోనే భారీగా నిధులు కేంద్రీకరించి నిర్మాణాలు చేపడితే వాటి ప్రయోజనం ఎంతమందికి దక్కుతుంది? ప్రజల అవసరాల కోసం ఖర్చు చేయాల్సిన నిధులు కేవలం రాజధాని నిర్మాణాలకే పరిమితమైతే రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల పరిస్థితి ఏమిటి?
నాడు ప్రజల తరఫున పోరాటం చేస్తానని గర్జించిన పవన్ కళ్యాణ్.. నేడు అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే ధైర్యంతో ప్రశ్నించగలరా? రైతులకు ఇచ్చిన నాటి భరోసా ఇప్పటికీ నిలబెట్టుకుంటారా? లేక అధికారంలోకి వచ్చిన తర్వాత నాటి మాటలు రాజకీయ ప్రసంగాలకే పరిమితమయ్యాయా?
నాడు భూసేకరణపై చంద్రబాబును నిలదీసిన పవన్ కళ్యాణ్.. నేడు అమరావతి పేరుతో జరుగుతున్న పరిణామాలపై తన వైఖరిని స్పష్టం చేయాలి.
పవన్ కళ్యాణ్ అమరావతి భూసేకరణ





