సచివాలయ ఉద్యోగుల ఆందోళన
ఐఆర్ లేదు.. పీఆర్సీ లేదు.. ఐదు డీఏలు పెండింగ్.. తమకు రావాల్సిన బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టత లేదు. సమస్యలు చెప్పుకునేందుకు విజయవాడకు వస్తే అడ్డంకులు. దీంతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఆగ్రహం ఒక్కసారిగా రోడ్డెక్కింది.
‘చలో విజయవాడ’కు పిలుపునిచ్చిన ఉద్యోగులు అడ్డంకులు దాటుకుని నగరానికి చేరుకున్నారు. ధర్నాకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకోవడం, పలువురిని అదుపులోకి తీసుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. ఉద్యోగ సంఘాలు మాత్రం “న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేది లేదు” అని స్పష్టం చేశాయి.
సచివాలయ ఉద్యోగుల ఆందోళన

రూ.40 వేల కోట్ల బకాయిల మాటేంటి?
ఐఆర్, పీఆర్సీతో పాటు ఐదు డీఏలు, ఇతర పెండింగ్ బకాయిలపై ఉద్యోగులు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఉద్యోగులకు మొత్తంగా సుమారు రూ.40 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.
“ఎన్నాళ్లు ఎదురుచూడాలి?” అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉద్యోగులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
సచివాలయ ఉద్యోగుల ఆందోళన
సచివాలయ ఉద్యోగుల డిమాండ్లు ఇవే
నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని, జూనియర్ అసిస్టెంట్ స్థాయి హోదా కల్పించాలని ఉద్యోగులు కోరుతున్నారు. సొంత మండలాల్లో నియామకాలకు అవకాశం కల్పించాలని, జీవో 11ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
సర్వీస్ సమస్యలు, పదోన్నతులు, వేతన సంబంధిత అంశాలపై కూడా ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.
సచివాలయ ఉద్యోగుల ఆందోళన
అడ్డుకున్నా వెనక్కి తగ్గలేదు.. రోడ్డుపైనే పోరాటం
చలో విజయవాడకు అనుమతి లేదని పోలీసులు ప్రకటించిన నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ఉద్యోగులను అడ్డుకున్నట్లు సంఘాలు ఆరోపించాయి. అయినప్పటికీ ఉద్యోగులు వివిధ మార్గాల్లో విజయవాడకు చేరుకున్నారు.
ధర్నా చౌక్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన సమయంలో పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మహిళా ఉద్యోగులను పోలీసులు ఈడ్చుకెళ్లడంపై ఆందోళనకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
లాఠీలతో చెదరగొట్టే ప్రయత్నాలు జరిగినా వెనక్కి తగ్గకుండా ఉద్యోగులు మండుటెండలో రోడ్డుపైనే బైఠాయించి నిరసన కొనసాగించారు.
సచివాలయ ఉద్యోగుల ఆందోళన
పోలీస్స్టేషన్లకు తరలింపు.. కేసులతో మరింత రగిలిన ఆగ్రహం
ఆందోళనలో పాల్గొన్న పెద్ద సంఖ్యలో ఉద్యోగులను వివిధ పోలీస్స్టేషన్లకు తరలించినట్లు ఉద్యోగ సంఘాలు తెలిపాయి. అక్కడ భోజనం, నీళ్లు అందించలేదని, కనీస కాలకృత్యాలు తీర్చుకునేందుకు కూడా ఇబ్బందులు ఎదురయ్యాయని కొందరు ఉద్యోగులు ఆరోపించారు.
ఈ ఆందోళనకు సంబంధించి 70 మందిపై కేసులు నమోదైనట్లు సంఘాలు వెల్లడించాయి. అయితే కేసులు, నిర్బంధాలతో తమ ఉద్యమాన్ని ఆపలేరని ఉద్యోగులు స్పష్టం చేశారు.
సచివాలయ ఉద్యోగుల ఆందోళన
ఇక జిల్లాలకు ఉద్యమం.. రేపు మూకుమ్మడి సెలవు
విజయవాడ ఘటనతో ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక తదుపరి కార్యాచరణను ప్రకటించింది. అన్ని జిల్లాల్లో కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వాలని, ఆ తర్వాత మూకుమ్మడిగా అనధికారిక సెలవు చేపట్టాలని నిర్ణయించింది.
దీంతో ఇప్పటివరకు విజయవాడ కేంద్రంగా సాగిన ఆందోళన జిల్లాల స్థాయికి విస్తరించే అవకాశం ఉంది.
సచివాలయ ఉద్యోగుల ఆందోళన
ఇక నిర్ణయం సర్కారుదే.. ఉద్యోగుల ఉద్యమం ఎటు?
ఐఆర్, పీఆర్సీ, డీఏలు, రూ.40 వేల కోట్ల బకాయిల నుంచి నోషనల్ ఇంక్రిమెంట్లు, హోదా, సర్వీస్ సమస్యల వరకు ఉద్యోగులు తమ డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. అడ్డుకున్నా.. కేసులు పెట్టినా.. నిర్బంధించినా వెనక్కి తగ్గబోమన్న సంకేతాన్ని ‘చలో విజయవాడ’తో ఇచ్చారు.
ఇప్పుడు బంతి ప్రభుత్వ కోర్టులో ఉంది. ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం చర్చలకు దిగుతుందా? లేక ఈ ఆందోళన మరింత విస్తరిస్తుందా? అన్నది చూడాలి.
సచివాలయ ఉద్యోగుల ఆందోళన







