డీఎస్సీ–2025 నియామకాల్లో స్పోర్ట్స్ కోటా వ్యవహారం రోజుకో కొత్త ప్రశ్నను లేవనెత్తుతోంది. అసలు జరగని టోర్నమెంట్ పేరుతో సర్టిఫికెట్లు ఎలా వచ్చాయి? వాటి ఆధారంగా టీచర్ ఉద్యోగాలు ఎలా ఇచ్చారు? 372 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను పూర్తిస్థాయిలో పరిశీలించకుండా నియామకాలు ఎలా జరిగాయి? టీడీపీ ఎమ్మెల్యే సంతకాన్ని ఏ నిబంధనల ప్రకారం ఆమోదించారు? ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లపై వచ్చిన ఆరోపణలకు బాధ్యత ఎవరిది? — ఇలా ప్రశ్నల వర్షం కురుస్తుంటే, సమాధానాలు మాత్రం దాటవేతలతోనే సరిపెట్టారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మీడియా అడిగిన ప్రశ్నలకు స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిన అధికారులు.. “మా పరిధిలో కాదు”, “కోర్టు పరిధిలో ఉంది”, “అసోసియేషన్లు ఇచ్చినవే ఒరిజినల్‌గా పరిగణిస్తాం” అంటూ తప్పించుకోవడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. అంతేకాదు.. సర్టిఫికెట్లు చూపించమని అడిగితే కేసులు పెడతామంటూ హెచ్చరికలు చేయడం మరింత కలకలం రేపుతోంది.
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా

అసోసియేషన్లు చెప్పిందే వేదం..!
డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో అభ్యర్థుల అర్హతలను స్పోర్ట్స్ అసోసియేషన్లు జారీ చేసిన సర్టిఫికెట్ల ఆధారంగానే పరిగణించినట్లు శాప్ వైస్ చైర్మన్ భరణి పేర్కొన్నట్లు కథనం వెల్లడించింది.
సర్టిఫికెట్లను పూర్తి స్థాయిలో పరిశీలించే అధికారం తమ పరిధిలో లేదని ఆమె చెప్పినట్లు పేర్కొంది. సాధారణంగా స్పోర్ట్స్ అసోసియేషన్లు జారీ చేసే ధ్రువపత్రాలను ఒరిజినల్‌గానే పరిగణిస్తామని ఆమె స్పష్టం చేసినట్లు తెలిపింది.
అక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది.
సర్టిఫికెట్ ఇచ్చింది ఎవరు? ఆ అసోసియేషన్‌కు గుర్తింపు ఉందా? నిబంధనల ప్రకారం సంతకం చేయాల్సిన అధికారి ఎవరు? సంతకం చేసిన వ్యక్తికి ఆ అధికారం ఉందా? వంటి ప్రాథమిక అంశాలను పరిశీలించకుండా కేవలం అసోసియేషన్ ఇచ్చిందనే కారణంతో సర్టిఫికెట్‌ను అసలైనదిగా ఎలా పరిగణిస్తారు?
టీడీపీ ఎమ్మెల్యే సంతకం.. నిబంధనలు ఎక్కడ?
టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అధ్యక్షుడిగా ఉన్న అసోసియేషన్‌కు కనీసం గుర్తింపు లేకపోయినా, నిబంధనల ప్రకారం అసోసియేషన్ సెక్రటరీ మాత్రమే అభ్యర్థుల ధ్రువీకరణ లేఖపై సంతకం చేయాల్సి ఉన్నప్పుడు.. కూన రవికుమార్ సంతకం ఆధారంగా ఉద్యోగాలు ఇచ్చారా? అని మీడియా ప్రశ్నించినట్లు కథనం పేర్కొంది.
దీనికి భరణి ఇచ్చిన సమాధానం ఇప్పుడు మరిన్ని ప్రశ్నలకు కారణమవుతోంది.
కూన రవికుమార్‌ను తాము ఎమ్మెల్యేగా చూడటం లేదని, అసోసియేషన్ అధ్యక్షుడిగానే చూస్తున్నామని, ఆయన సంతకాన్ని ఆమోదించాలని ఫెడరేషన్ చెప్పిందని ఆమె పేర్కొన్నట్లు కథనం తెలిపింది.
అంటే.. రాజకీయ పదవి పక్కన పెట్టి అసోసియేషన్ అధ్యక్షుడిగా సంతకం చేశారంటే చాలు? నిబంధనల్లో నిర్దేశించిన అధికారి సంతకం కాకపోయినా ఫెడరేషన్ చెప్పిందన్న ఒక్క కారణంతో ఆ సంతకాన్ని ఆమోదించవచ్చా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా
372 సర్టిఫికెట్లపై విచారణ సాధ్యం కాదట!
డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన 372 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లపై పూర్తిస్థాయిలో విచారణ చేయడం సాధ్యం కాదని అధికారులు చెప్పినట్లు కథనం పేర్కొంది.
ఇక్కడే మరో కీలక సందేహం.
వేలాది మంది నిరుద్యోగులు డీఎస్సీ ఫలితాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తుంటే.. ఒక్కో సర్టిఫికెట్ ఆధారంగా ఒకరి ఉద్యోగ అర్హత నిర్ణయించబడుతుంది. అలాంటప్పుడు 372 మంది సర్టిఫికెట్లపై అనుమానాలు వ్యక్తమైతే వాటిని పూర్తిగా పరిశీలించాల్సిన బాధ్యత ఎవరిది?
సర్టిఫికెట్లు ఇచ్చింది మేం కాదు.. పరిశీలించే అధికారం మాకు లేదు.. విచారణ సాధ్యం కాదు అంటూ వ్యవస్థ మొత్తం చేతులెత్తేస్తే.. మరి ఉద్యోగాలు ఇచ్చే ముందు అర్హతలను ఎవరు నిర్ధారించారు? అన్నదే నిరుద్యోగుల ప్రశ్న.
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా
అసలు జరగని టోర్నమెంట్.. సర్టిఫికెట్లు ఎలా వచ్చాయి?
ఈ వ్యవహారంలో అత్యంత తీవ్రమైన ఆరోపణగా నిలుస్తున్నది ఖమ్మం జూడో టోర్నమెంట్ అంశం.
ఖమ్మంలో టోర్నమెంట్ జరిగిందంటూ జూడో సర్టిఫికెట్లతో వచ్చిన నలుగురు అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చారు. కానీ అక్కడ అసలు ఆ టోర్నమెంట్ జరగలేదని ఆరోపణలు ఉన్నాయి.
మరి జరగని టోర్నమెంట్‌లో పాల్గొన్నట్లు సర్టిఫికెట్లు ఎలా వచ్చాయి?
ఆ సర్టిఫికెట్లపై విచారణ జరిగిందా?
టోర్నమెంట్ జరిగినట్లు రికార్డులు ఉన్నాయా?
అభ్యర్థులు నిజంగానే పాల్గొన్నారా?
సర్టిఫికెట్లు ఎవరు జారీ చేశారు?
అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన సమయంలో.. ఈ అంశం న్యాయస్థానం పరిధిలో ఉన్నందున తాము ఏమీ మాట్లాడలేమని భరణి సమాధానం దాటవేసినట్లు కథనం పేర్కొంది.
ఇదే అసలు విషయం! జరగని టోర్నమెంట్ పేరుతో సర్టిఫికెట్లు వస్తే.. వాటి ఆధారంగా ఉద్యోగాలు ఎలా వచ్చాయి? అన్న ప్రశ్నకు మాత్రం స్పష్టత కరువైంది.
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా
అభ్యర్థుల సర్టిఫికెట్లు అడిగితే.. కేసులు పెడతామా?
ఇంకోవైపు.. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన 372 మంది అభ్యర్థులకు ఫోన్లు చేసి సర్టిఫికెట్లు చూపించాలని అడుగుతున్నారని అన్సారియా చెప్పినట్లు కథనం పేర్కొంది.
కానీ ఎవరైనా సర్టిఫికెట్లు చూపించాలని అడిగితే వారిపై చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించినట్లు తెలిపింది.
ఇది మరింత విస్మయానికి గురిచేస్తున్న అంశంగా మారింది.
ఒకవైపు సర్టిఫికెట్లపై సందేహాలు ఉన్నాయి. మరోవైపు వాటి ప్రామాణికతను నిర్ధారించేందుకు సర్టిఫికెట్లు చూపించాలని అడుగుతున్నారు. అదే సమయంలో అడిగిన వారిపైనే కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు.
అయితే అనుమానాస్పద సర్టిఫికెట్లను ఎలా ధృవీకరించాలి? నిజానిజాలు ఎలా బయటపడాలి?
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా
ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్ తప్పుగా అప్‌లోడ్ చేశారట.. ‘మానవ తప్పిదం’ అంటూ వెనకేసుకొచ్చారా?
అభ్యర్థి పెద అప్పలరాజు వ్యవహారంలోనూ అధికారులు ఇచ్చిన వివరణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఆయన తన సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో తప్పుగా అప్‌లోడ్ చేశారని, తన సర్టిఫికెట్‌తో పాటు సోదరుడి సర్టిఫికెట్ కూడా ఇచ్చారని, దీనిని కేవలం మానవ తప్పిదంగా పరిగణించినట్లు భరణి చెప్పినట్లు కథనం వెల్లడించింది.
అంతేకాదు.. “భార్యాభర్తలకు ఉద్యోగాలు రాకూడదా? 41 ఏళ్లు ఉన్న వారికి ఉద్యోగం ఇవ్వకూడదా?” అని ఆమె ప్రశ్నించినట్లు పేర్కొంది.
ఎలాంటి మార్కులు రాకపోయినా స్పోర్ట్స్ మెరిట్ ఉంటే ఉద్యోగాలు ఇస్తామని కూడా చెప్పినట్లు కథనం తెలిపింది.
కానీ ప్రశ్న వయసుపై కాదు.. భార్యాభర్తలు ఉద్యోగాలు పొందడంపైనా కాదు.
సమర్పించిన సర్టిఫికెట్లు సరైనవేనా? నిబంధనలకు అనుగుణంగానే అర్హత నిర్ధారించారా? అన్నదే అసలు ప్రశ్న.
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా
టెట్ విషయంలోనూ కొత్త వివరణలు..
టీచర్లందరికీ టెట్ తప్పనిసరి అని పాఠశాల విద్య కమిషనర్ అన్సారియా స్పష్టం చేసినట్లు కథనం పేర్కొంది.
వల్లూరులో టీచర్‌గా నియమించిన ప్రభాకర్ టెట్‌లో అర్హత సాధించలేదన్న ప్రశ్నకు స్పందిస్తూ.. టెట్‌ను ఎన్నిసార్లయినా రాయవచ్చని, ఆయన ఒకసారి రాసినప్పుడు 77 మార్కులతో అర్హత సాధించారని, అయినప్పటికీ కమిటీ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు తెలిపింది.
అదేవిధంగా కర్నూలులో ఉష అనే ఉపాధ్యాయురాలు టెట్‌లో తెలుగు సబ్జెక్టులో అర్హత సాధించలేదన్న ప్రశ్నకు కూడా అన్సారియా స్పందించినట్లు కథనం పేర్కొంది.
ఏ సబ్జెక్టు బోధించే టీచర్ అయినా అదే సబ్జెక్టులో టెట్ అర్హత సాధించాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొన్నట్లు తెలిపింది.
దీంతో టెట్ నిబంధనలు అసలు ఏమిటి? వాటిని నియామకాల సమయంలో ఎలా అమలు చేశారు? అన్న ప్రశ్నలు మరోసారి తెరపైకి వచ్చాయి.
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా
ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు ఫేక్ అని తేలినా.. బాధ్యత ఎవరిది?
డీఎస్సీ నియామకాల్లో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లపై కూడా తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.
ఆర్థికంగా బలంగా ఉన్నవారికి కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు జారీ చేసి, వాటి ఆధారంగా డీఎస్సీలో ఉద్యోగాలు కట్టబెట్టారనే ఆరోపణలపై అధికారులు ప్రశ్నలు ఎదుర్కొన్నట్లు కథనం పేర్కొంది.
ఈ అంశం తమ పరిధిలోనిది కాదని అన్సారియా దాటవేత ధోరణి ప్రదర్శించినట్లు తెలిపింది.
సర్టిఫికెట్లు తహసీల్దార్లు జారీ చేస్తారని, రెవెన్యూ విభాగానికి చెప్పి విచారణ చేయిస్తామని ఆమె చెప్పినట్లు కథనం పేర్కొంది.
అంటే.. ఉద్యోగం మాత్రం విద్యాశాఖ ద్వారా.. సర్టిఫికెట్ రెవెన్యూ శాఖ ద్వారా.. స్పోర్ట్స్ సర్టిఫికెట్ అసోసియేషన్ ద్వారా.. తప్పు జరిగితే బాధ్యత మాత్రం ఎవరిదీ కాదు? అనే ప్రశ్నలు నిరుద్యోగ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా
సర్టిఫికెట్లు అడిగితే కేసులు.. ప్రశ్నిస్తే బెదిరింపులా?
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా వ్యవహారంపై ప్రశ్నలు అడిగే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు హెచ్చరించడం మరింత వివాదాస్పదంగా మారింది.
కుప్పంలో ఇలాంటి ఘటన జరిగితే 24 గంటల్లోనే ఒక విలేకరి, కెమెరామెన్‌పై కేసు నమోదు చేశామని అన్సారియా చెప్పినట్లు కథనం పేర్కొంది.
అయితే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ నియామకాలపై ప్రశ్నించడం నేరమా? సర్టిఫికెట్ల ప్రామాణికతపై సందేహాలు ఉంటే వాటిని బయటపెట్టడం తప్పా? నిరుద్యోగుల తరఫున మీడియా ప్రశ్నలు అడగకూడదా? అనే ప్రశ్నలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి.
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా
దొరికిపోయినా దబాయింపేనా?
డీఎస్సీ–2025 స్పోర్ట్స్ కోటా నియామకాలపై వస్తున్న ఆరోపణలు కేవలం కొన్ని సర్టిఫికెట్లకే పరిమితమైనవి కావు. 372 సర్టిఫికెట్లు, అసోసియేషన్ల గుర్తింపు, టీడీపీ ఎమ్మెల్యే సంతకం, జరగని టోర్నమెంట్ పేరుతో సర్టిఫికెట్లు, టెట్ అర్హతలు, ఈడబ్ల్యూఎస్ ధ్రువపత్రాలు, అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన, మీడియాపై కేసుల హెచ్చరికలు.. ఇలా ప్రతి అంశం ఒక్కో ప్రశ్నను లేవనెత్తుతోంది.
వేలాది మంది నిరుద్యోగులు పారదర్శకమైన నియామక ప్రక్రియ కోసం ఎదురుచూస్తున్న సమయంలో.. “అసోసియేషన్ ఇచ్చింది కాబట్టి ఒరిజినల్”, “మా పరిధిలో కాదు”, “కోర్టు పరిధిలో ఉంది”, “రెవెన్యూ శాఖ చూస్తుంది” అంటూ బాధ్యతను ఒకరి నుంచి మరొకరికి నెట్టడం అనుమానాలను మరింత పెంచుతోంది.
నిజంగా అన్నీ నిబంధనల ప్రకారమే జరిగి ఉంటే.. 372 సర్టిఫికెట్లపై సమగ్ర విచారణకు ఎందుకు వెనుకడుగు? జరగని టోర్నమెంట్ పేరుతో వచ్చిన సర్టిఫికెట్లపై పూర్తి స్పష్టత ఎందుకు లేదు? అనుమానాస్పద సర్టిఫికెట్లను చూపించాలని అడిగిన వారినే ఎందుకు హెచ్చరించాలి?
ప్రశ్నలకు బెదిరింపులు సమాధానం కావు.
డీఎస్సీ ఉద్యోగాలు ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల వచ్చినవి కావు.. అర్హత ఉన్న నిరుద్యోగుల హక్కు.
అందుకే స్పోర్ట్స్ కోటా కింద జరిగిన మొత్తం నియామక ప్రక్రియపై స్వతంత్ర, సమగ్ర విచారణ జరిపి.. నిజమైన అర్హులకు న్యాయం చేయడంతో పాటు, తప్పు జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా







