రూ.100 కోట్ల భూమిపై కన్ను?.. నిషేధిత జాబితా నుంచి డెవలపర్ల చేతికి.. ఎమ్మెల్యే, మంత్రి అనుచరులపై రిటైర్డ్ ఆర్టీవో తీవ్ర ఆరోపణలు
ఇంట్రో
తిరుపతి రూరల్ మండలం అవిలాల పంచాయతీ పరిధిలోని సుమారు రూ.100 కోట్ల విలువైన 3.17 ఎకరాల భూమి వివాదం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. రిటైర్డ్ ఆర్టీవో ద్వారకానాథ్ రెడ్డి తన రిటైర్మెంట్ సొమ్ముతో కొనుగోలు చేసిన భూమిని తప్పుడు పత్రాలు, రెవెన్యూ రికార్డుల మార్పులు, నిషేధిత జాబితా పేరిట కబ్జా చేశారని ఆరోపించారు. ఈ వ్యవహారం వెనుక చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అనుచరులు, కొందరు అధికారులు ఉన్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.
రూ.100 కోట్ల భూమి కబ్జా

రిటైర్మెంట్ డబ్బులతో కొనుగోలు చేసిన భూమి
పీలేరు ఎర్రమిట్టకు చెందిన రిటైర్డ్ ఆర్టీవో ద్వారకానాథ్ రెడ్డి కుటుంబం 2002-03లో తిరుపతి మండలం అవిలాల పరిధిలోని సర్వే నంబర్ 476/1లో 3 ఎకరాల 17 సెంట్ల భూమిని కొనుగోలు చేసింది. ఆ భూమి తన భార్య వనజ పేరుతో ఆన్లైన్లో నమోదైందని, ఈసీతో పాటు ప్రభుత్వ రికార్డుల్లో కూడా తమ పేర్లే ఉన్నాయని ఆయన చెబుతున్నారు.
1986 సేల్ డీడ్ రద్దు.. మరుసటి రోజే రిజిస్ట్రేషన్లు?
గత ఏడాది ఆగస్టు 25న తిరుపతి రూరల్ తహసీల్దార్ నుంచి నోటీసులు వచ్చాయని, 1986 నాటి సేల్ డీడ్‌ను రద్దు చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారని ద్వారకానాథ్ రెడ్డి తెలిపారు. అయితే, నోటీసులు ఇచ్చిన మరుసటి రోజే ఇతరుల పేర్లతో జీపీఏలు, రిజిస్ట్రేషన్లు జరగడానికి అవకాశం కల్పించారని ఆయన ఆరోపించారు.
రూ.100 కోట్ల భూమి కబ్జా
22ఏ నుంచి తొలగించి డెవలపర్లకు అప్పగించారా?
తమ భూమిని ముందుగా నిషేధిత జాబితాలో చేర్చి వివాదం సృష్టించారని, అనంతరం వెబ్‌ల్యాండ్‌లో తమ పేర్లు తొలగించి ఇతరుల పేర్లు నమోదు చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఆ తర్వాత భూమిని 22ఏ పరిధి నుంచి తొలగించి ఎస్ఎన్ఎల్ డెవలపర్స్‌కు రిజిస్ట్రేషన్ చేసి, ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీ పేరుతో ప్లాట్లుగా మార్చి విక్రయాలకు సిద్ధం చేశారని వారు పేర్కొన్నారు.
రూ.100 కోట్ల భూమి కబ్జా
20 రిజిస్ట్రేషన్లు జరిగిన భూమి నిషేధిత జాబితాలోకి ఎలా?
1986 నుంచి ఈ భూమిపై 20కు పైగా రిజిస్ట్రేషన్లు జరిగాయని, అలాంటి భూమి ఒక్కసారిగా నిషేధిత జాబితాలోకి ఎలా చేరిందని ద్వారకానాథ్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ భూములకే కాదు, పట్టా భూములకూ రక్షణ లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రూ.100 కోట్ల భూమి కబ్జా
కోర్టుల చుట్టూ తిరుగుతున్న వృద్ధ దంపతులు
రవాణా శాఖలో ఉద్యోగ విరమణ తర్వాత వచ్చిన సొమ్ముతో కొనుగోలు చేసిన భూమి కోసం ఇప్పుడు కోర్టులు, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చిందని ద్వారకానాథ్ రెడ్డి వాపోయారు. రూ.100 కోట్ల విలువైన తమ భూమిని డెవలపర్ల పేరిట ఆన్‌లైన్‌లోకి తీసుకెళ్లారని, తహసీల్దార్‌ను ప్రశ్నిస్తే “కోర్టులో చూసుకోండి” అని సమాధానం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రూ.100 కోట్ల భూమి కబ్జా
రూ.100 కోట్ల భూమి ఎవరిది?.. ఆరోపణలపై నిజాలు తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే
రూ.100 కోట్ల విలువైన భూమిపై రిటైర్డ్ ఆర్టీవో ద్వారకానాథ్ రెడ్డి చేసిన ఆరోపణలు తిరుపతి జిల్లాలో తీవ్ర చర్చకు దారి తీశాయి. నిషేధిత జాబితా, రికార్డుల మార్పులు, వెబ్‌ల్యాండ్ ఎంట్రీలు, డెవలపర్లకు రిజిస్ట్రేషన్లు, ప్రజాప్రతినిధుల అనుచరుల పాత్రపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు బయటపెట్టాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
గమనిక: ఈ కథనంలో పేర్కొన్న అంశాలు బాధితుడు ద్వారకానాథ్ రెడ్డి చేసిన ఆరోపణల ఆధారంగా రూపొందించబడింది. సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ ఆరోపణలపై స్పందించాల్సి ఉంది.

రూ.100 కోట్ల భూమి కబ్జా





