జడ్పీటీసీ ఎంపీటీసీ కౌంటింగ్ అక్రమాలు
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌లోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ వైఎస్సార్సీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. పోలైన ఓట్లకు, బ్యాలెట్ బాక్సుల్లో లభించిన ఓట్లకు మధ్య తేడాలు కనిపించడం, వైఎస్సార్సీపీ కౌంటింగ్ ఏజెంట్లను అడ్డుకోవడం, మరోవైపు అధికార పార్టీ నేతల పీఏలు, కుటుంబ సభ్యులకు కౌంటింగ్ కేంద్రాల్లో అనుమతులు కల్పించారనే ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఎన్నికల సంఘం నిబంధనలు ఒకలా ఉంటే.. క్షేత్రస్థాయిలో పోలీసుల వ్యవహారశైలి మరోలా ఉందంటూ వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జడ్పీటీసీ ఎంపీటీసీ కౌంటింగ్ అక్రమాలు

ఐదు ఓట్లు ఎక్కడికి పోయాయి? ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం కౌంటింగ్ కేంద్రం వద్ద ఓట్ల లెక్కింపుపై వివాదం చెలరేగింది. కొటికలపూడి ఎంపీటీసీ స్థానంలో మొత్తం 2,432 ఓట్లు పోలవగా, బ్యాలెట్ బాక్సులో 2,427 ఓట్లు మాత్రమే ఉన్నట్లు గుర్తించడంతో ఐదు ఓట్ల తేడా బయటపడింది. ఈ ఐదు ఓట్లు ఏమయ్యాయంటూ వైఎస్సార్సీపీ నాయకులు ప్రశ్నించగా, వారిని సీఐ సుబ్రహ్మణ్యం అడ్డుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా వైఎస్సార్సీపీ కౌంటింగ్ ఏజెంట్లను కూడా అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
జడ్పీటీసీ ఎంపీటీసీ కౌంటింగ్ అక్రమాలు
జగ్గయ్యపేటలో ఏజెంట్లకు అడ్డంకులు.. కేసుల పేరుతో నిరాకరణ
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట కౌంటింగ్ హాల్ వద్ద వైఎస్సార్సీపీ ఏజెంట్లను పోలీసులు అడ్డుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కేసులు ఉన్నాయనే కారణంతో కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించలేదని వైఎస్సార్సీపీ నేతలు చెబుతున్నారు. పోలీసుల తీరుపై పార్టీ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు సీఐ వెంకటేశ్వర్లును ప్రశ్నించారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వచ్చిన ఏజెంట్లను అడ్డుకోవడం ఏ నిబంధనల ప్రకారమని ఆయన నిలదీసినట్లు సమాచారం.
జడ్పీటీసీ ఎంపీటీసీ కౌంటింగ్ అక్రమాలు
పీలేరులో ఆరు మండలాల ఏజెంట్లకు నో ఎంట్రీ!
అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలోనూ ఇదే తరహా వివాదం తలెత్తింది. నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాలకు చెందిన వైఎస్సార్సీపీ కౌంటింగ్ ఏజెంట్లకు పోలీసులు అనుమతి నిరాకరించారనే ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అధికారికంగా ఏజెంట్ పాసులు జారీ చేసినప్పటికీ, వాటిని పోలీసులు పరిగణనలోకి తీసుకోలేదని వైఎస్సార్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బైండోవర్ కేసుల పేరుతో ఏజెంట్లను విధుల్లోకి వెళ్లకుండా అడ్డుకోవడంతో పాటు, కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని బలవంతంగా బయటకు పంపించారనే ఆరోపణలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.
జడ్పీటీసీ ఎంపీటీసీ కౌంటింగ్ అక్రమాలు
కాకినాడలో ఆలస్యం.. అధికార పార్టీకి మాత్రం ప్రత్యేక వెసులుబాటా?
కాకినాడ పీఆర్ కళాశాల కౌంటింగ్ కేంద్రం వద్ద కూడా పోలీసుల వ్యవహారశైలిపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఏజెంట్లను సకాలంలో కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించకుండా ఆలస్యం చేశారని ఆరోపణలు వచ్చాయి. అధికారులు లోపలికి వెళ్లిన తర్వాతే మండలాల వారీగా ఏజెంట్లను అనుమతిస్తామంటూ పోలీసులు కాలయాపన చేసినట్లు వైఎస్సార్సీపీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు అధికార పార్టీ ఎమ్మెల్యేల పీఏలు, కుటుంబ సభ్యులకు కౌంటింగ్ కేంద్రాల్లో ప్రవేశం కల్పించారనే ఆరోపణలు మరింత వివాదానికి దారితీశాయి.
జడ్పీటీసీ ఎంపీటీసీ కౌంటింగ్ అక్రమాలు
హిందూపురంలో బాలకృష్ణ పీఏలకు అనుమతి.. మీడియాకు మాత్రం నిరాకరణ!
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం కౌంటింగ్ కేంద్రం వద్ద మరో వివాదం వెలుగులోకి వచ్చింది. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏలు శ్రీనివాసరావు, బాలాజీ కౌంటింగ్ కేంద్రంలోనే తిష్టవేసినట్లు ఆరోపణలు వచ్చాయి. వారికి అనుమతులు కల్పించిన పోలీసులు మీడియా ప్రతినిధులను మాత్రం లోపలికి అనుమతించలేదనే విమర్శలు వ్యక్తమయ్యాయి. కౌంటింగ్ ప్రక్రియను కవర్ చేయాల్సిన మీడియాకు అడ్డంకులు సృష్టిస్తూ, అధికార పార్టీకి చెందిన వ్యక్తులకు మాత్రం వెసులుబాటు కల్పించడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
జడ్పీటీసీ ఎంపీటీసీ కౌంటింగ్ అక్రమాలు
పుట్టపర్తిలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి హల్చల్
పుట్టపర్తి కౌంటింగ్ కేంద్రంలో టీడీపీ నేత, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి హల్చల్ చేసినట్లు వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఆయన కౌంటింగ్ కేంద్రంలోనే తిష్టవేయడంపై వైఎస్సార్సీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు వైఎస్సార్సీపీ నాయకులను హౌస్ అరెస్టులు, నిర్బంధాలతో కట్టడి చేశారనే ఆరోపణలు కూడా వినిపించాయి.
జడ్పీటీసీ ఎంపీటీసీ కౌంటింగ్ అక్రమాలు
నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి హౌస్ అరెస్ట్
కర్నూలు జిల్లా నందికొట్కూరులో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో వైఎస్సార్సీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. నందికొట్కూరు వైఎస్సార్సీపీ కార్యాలయానికి వెళ్తున్న ఆయనను పోలీసులు అడ్డుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కౌంటింగ్ సమయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అందుబాటులో ఉండకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు.
జడ్పీటీసీ ఎంపీటీసీ కౌంటింగ్ అక్రమాలు
కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ప్రత్యేక అనుమతులా?
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం కౌంటింగ్ కేంద్రం వద్ద కూడా వివాదం చోటుచేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కుటుంబ సభ్యులు కౌంటింగ్ కేంద్రంలో హల్చల్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. మరోవైపు వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎంపీ తలారి రంగయ్యను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవైపు ప్రతిపక్ష నేతను నిర్బంధించి, మరోవైపు అధికార పార్టీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు కౌంటింగ్ కేంద్రంలోకి ప్రవేశం కల్పించడంపై వైఎస్సార్సీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
జడ్పీటీసీ ఎంపీటీసీ కౌంటింగ్ అక్రమాలు
ఎమ్మెల్యే పీఏ రవీంద్ర హల్చల్.. అధికారుల వద్దకు వెళ్లి మరీ మాట్లాడారా?
నంద్యాల జిల్లా నందికొట్కూరు కౌంటింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే జయసూర్య పీఏ రవీంద్ర వ్యవహారం చర్చనీయాంశమైంది. ఆయన కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లి అధికారులతో, ఏజెంట్లతో మాట్లాడినట్లు ఆరోపణలు వచ్చాయి. అధికార పార్టీ ఎమ్మెల్యే పీఏ కౌంటింగ్ కేంద్రంలో తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదని వైఎస్సార్సీపీ వర్గాలు విమర్శిస్తున్నాయి.
జడ్పీటీసీ ఎంపీటీసీ కౌంటింగ్ అక్రమాలు
ఆత్మకూరులో వైఎస్సార్సీపీ నేతలకు నిర్బంధం
నంద్యాల జిల్లా ఆత్మకూరులోనూ వైఎస్సార్సీపీ నాయకులపై పోలీసుల ఆంక్షలు కొనసాగినట్లు ఆరోపణలు వచ్చాయి. శ్రీశైలం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త శిల్పా భువనేశ్వర్రెడ్డిని ఆత్మకూరులోని పార్టీ కార్యాలయంలోనే పోలీసులు నిర్బంధించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కౌంటింగ్‌కు హాజరుకాకుండా ఆయనను అడ్డుకున్నారని ఆరోపించాయి. మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణిరెడ్డి, శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డిలను కూడా హౌస్ అరెస్ట్ చేసి కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లకుండా అడ్డుకున్నట్లు పేర్కొన్నాయి.
జడ్పీటీసీ ఎంపీటీసీ కౌంటింగ్ అక్రమాలు
కౌంటింగ్ పారదర్శకతపై సమాధానం చెప్పాల్సిందే!
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వెలుగుచూసిన ఈ పరిణామాలు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ పారదర్శకతపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. పోలైన ఓట్లకు, బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లకు తేడా ఎందుకు వచ్చింది? అధికారిక పాసులు ఉన్న కౌంటింగ్ ఏజెంట్లను ఎందుకు అడ్డుకున్నారు? మీడియా ప్రతినిధులకు ప్రవేశం నిరాకరిస్తూ, అధికార పార్టీ నేతల పీఏలు, కుటుంబ సభ్యులకు ఎలా అనుమతులు ఇచ్చారు? ప్రతిపక్ష నేతలపై హౌస్ అరెస్టులు, నిర్బంధాలు ఎందుకు?
ఈ ప్రశ్నలకు ఎన్నికల అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు స్పష్టమైన సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు నమ్మకం ఉండాలంటే ప్రతి ఓటు లెక్కింపు పారదర్శకంగా జరగాలి. అధికార, ప్రతిపక్ష పార్టీలకు వేర్వేరు నిబంధనలు ఉండకూడదు. ఐదు ఓట్ల తేడా నుంచి కౌంటింగ్ కేంద్రాల్లో ప్రవేశాల వివాదాల వరకు వచ్చిన ఆరోపణలన్నింటిపైనా నిష్పక్షపాత విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంది.
జడ్పీటీసీ ఎంపీటీసీ కౌంటింగ్ అక్రమాలు





