సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పాలసీ
ఎన్నికల సమయంలో సంపద సృష్టిస్తామని, ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతామని హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రచారం కోసం సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను అధికారికంగా ఎంప్యానెల్ చేసే విధానాన్ని తీసుకొచ్చింది. G.O.Ms.No.197 ద్వారా ఈ పాలసీకి అధికారిక రూపం ఇవ్వడంతో.. ప్రజాధనం వినియోగంపై ఇప్పుడు కొత్త ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Social Media Influencers (SMIs) Empanelment Policyకి శ్రీకారం చుట్టింది. సెప్టెంబర్ 28, 2026న G.O.Ms.No.197 జారీ చేసింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మౌలిక వసతులు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా అవగాహన కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడమే పాలసీ ఉద్దేశంగా పేర్కొంది.
అయితే ఇప్పుడు అసలు చర్చ పాలసీ ఉందా లేదా అన్నది కాదు.. ప్రజాధనం ఎక్కడికి, ఎలా ఖర్చవుతుంది అన్నదే!
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పాలసీ

హామీల అమలుపై ప్రశ్నలు.. ప్రచారానికి మాత్రం కొత్త పాలసీ!
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, వివిధ సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కేటాయింపుపై రాష్ట్రంలో చర్చ కొనసాగుతున్న సమయంలో.. ప్రభుత్వం సోషల్ మీడియా ప్రచారం కోసం ప్రత్యేకంగా ఇన్‌ఫ్లుయెన్సర్లను ఎంప్యానెల్ చేసే విధానం తీసుకురావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
ప్రజలకు ఇచ్చిన హామీలకు నిధులు సమకూర్చడం ఒక వైపు.. ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారానికి ప్రత్యేకంగా చెల్లింపులు చేయడం మరోవైపు.. ఈ ప్రాధాన్యతలపై ప్రభుత్వం ప్రజలకు ఏం చెబుతుంది? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వం మాత్రం తన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల సమాచారం ఎక్కువ మంది ప్రజలకు చేరేందుకు సోషల్ మీడియా క్రియేటర్లను అధికారిక వ్యవస్థలోకి తీసుకురావడమే లక్ష్యమని చెబుతోంది.
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పాలసీ
ఒక్కో ఇన్‌ఫ్లుయెన్సర్‌కు రూ.75 వేల వరకు!
ఈ పాలసీలో ఇన్‌ఫ్లుయెన్సర్లను వారి ఫాలోవర్ల ఆధారంగా నాలుగు కేటగిరీలుగా విభజించారు.
- Category A: 1,00,000+ ఫాలోవర్లు
- Category B: 50,000–99,999
- Category C: 25,000–49,999
- Category D: 10,000–24,999
ప్రభుత్వం అందించే గ్రాఫిక్స్‌ను పోస్టు చేస్తే కేటగిరీ ఆధారంగా రూ.500 నుంచి రూ.1,500 వరకు చెల్లింపు ఉంటుంది.
ప్రభుత్వం అందించే ఆడియో-విజువల్స్‌ను పోస్టు చేస్తే రూ.750 నుంచి రూ.2,000 వరకు చెల్లించే విధానం ఉంది.
ఇక ఇన్‌ఫ్లుయెన్సర్ స్వయంగా ఆడియో-విజువల్ కంటెంట్ తయారు చేసి, అథారిటీ ఆమోదిస్తే రూ.2,500 నుంచి రూ.15,000 వరకు చెల్లించే స్లాబ్ ఉంది. ఒక్కో ఇన్‌ఫ్లుయెన్సర్‌కు నెలకు గరిష్టంగా రూ.75,000 వరకు remuneration పరిమితి విధించారు.
అంటే ప్రభుత్వ ప్రచారం కోసం ఇప్పుడు ఫాలోవర్లు, కంటెంట్, కాంట్రాక్ట్, పారితోషికం అన్నీ కలిసిన ఒక అధికారిక వ్యవస్థ ఏర్పడినట్టే.
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పాలసీ
ప్రభుత్వ ప్రచారానికి ఇన్‌ఫ్లుయెన్సర్ల అవసరం ఎందుకు వచ్చింది?
ఇప్పటికే ప్రభుత్వానికి సమాచార, పౌర సంబంధాల శాఖ ఉంది. ప్రభుత్వ అధికారిక సోషల్ మీడియా ఖాతాలు ఉన్నాయి. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై అధికారిక సమాచారం అందించే వ్యవస్థ కూడా ఉంది.
అయినా ప్రైవేట్ సోషల్ మీడియా క్రియేటర్లను ఎంప్యానెల్ చేసి వారికి నిర్దిష్ట కంటెంట్‌కు చెల్లింపులు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది?
ప్రభుత్వం దీనికి సోషల్ మీడియా రీచ్‌ను ఉపయోగించుకోవడం, ప్రభుత్వ సమాచారాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం ప్రధాన కారణమని చెబుతోంది.
కానీ ప్రజాధనం ఖర్చు అవుతున్నప్పుడు ప్రజలు అడిగే ప్రశ్నలు మాత్రం సహజమే.
ఎంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్లను ఎంప్యానెల్ చేస్తారు?
ఏ కంటెంట్‌కు ఎంత చెల్లిస్తారు?
మొత్తం ప్రభుత్వ ఖజానాపై ఎంత భారం పడుతుంది?
ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది?
చెల్లింపుల వివరాలను ప్రజలకు వెల్లడిస్తారా?
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పాలసీ
మీ సోషల్ మీడియా డేటా కూడా ఇవ్వాల్సిందే!
ఈ పాలసీలో మరో కీలకమైన అంశం డేటా, డాక్యుమెంటరీ వెరిఫికేషన్.
ఎంప్యానెల్‌మెంట్ కోసం ఇన్‌ఫ్లుయెన్సర్లు తమ సోషల్ మీడియా ఖాతాలు, ఫాలోవర్ల వివరాలు, పోస్టుల చరిత్ర, అనలిటిక్స్ తదితర ఆధారాలను సమర్పించాలి. గత పోస్టులను కూడా పరిశీలించే విధానం పాలసీలో ఉంది.
అంతేకాదు.. వ్యక్తిగత డేటాను ప్రాసెస్ చేయడానికి Digital Personal Data Protection Act, 2023 కింద సమ్మతి ఇవ్వాల్సిన నిబంధన కూడా ఉంది.
అందుకే ఇక్కడ మరో ప్రశ్న:
ప్రభుత్వం సేకరించే ఇన్‌ఫ్లుయెన్సర్ల డేటా ఎలా భద్రపరుస్తారు? ఎంతకాలం ఉంచుతారు? ఏ అవసరాల కోసం ఉపయోగిస్తారు?
ఇలాంటి విషయాలపై స్పష్టమైన సమాచారం ప్రజలకు అందుబాటులో ఉండటం కీలకం.
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పాలసీ
ఏడాది ఎంప్యానెల్‌మెంట్.. తర్వాత ఏమవుతుంది?
క్యాబినెట్ ఆమోద సమయంలో వెల్లడించిన వివరాల ప్రకారం ప్రారంభ ఎంప్యానెల్‌మెంట్ ఒక సంవత్సరం ఉంటుంది. పనితీరు ఆధారంగా మరో కాలానికి పొడిగించే అవకాశం ఉంది.
అంటే సోషల్ మీడియా ప్రచారాన్ని తాత్కాలిక ప్రకటనగా కాకుండా.. నిర్దిష్ట నిబంధనలు, ఎంపిక ప్రక్రియ, పనితీరు పరిశీలనతో కూడిన వ్యవస్థగా ప్రభుత్వం రూపొందించింది.
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పాలసీ
అసలు లెక్క ప్రజలకు చెప్పాల్సిందే!
ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు సమాచారం అందించడం ఒక విషయం.
ఆ సమాచారం కోసం ప్రజాధనంతో ప్రైవేట్ సోషల్ మీడియా ఖాతాలకు చెల్లింపులు చేయడం మరో విషయం.
రెండింటి మధ్య పారదర్శకత ఉండాల్సిందే.
ప్రభుత్వం ఎవరిని ఎంప్యానెల్ చేసింది?
ఎంతమందిని ఎంప్యానెల్ చేసింది?
వారికి ఎంత చెల్లించింది?
ఏ పోస్టుకు ఎంత చెల్లించింది?
నెలకు మొత్తం ఎంత ఖర్చు అవుతోంది?
ఈ వివరాలను ప్రజల ముందుంచితేనే ఈ పాలసీపై వచ్చే అనుమానాలకు స్పష్టత వస్తుంది.
ప్రజలకు సంక్షేమం అందించడంలో ప్రతి రూపాయికీ విలువ ఉన్నట్టే.. ప్రభుత్వ ప్రచారానికి ఖర్చు చేసే ప్రతి రూపాయికీ కూడా లెక్క ఉండాలి.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు, సంక్షేమ పథకాలకు నిధులు, మరోవైపు సోషల్ మీడియా ప్రచారానికి కేటాయించే ప్రజాధనం.. ఈ మూడు అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన లెక్కలు ప్రజలకు అందిస్తుందా?
ఇప్పుడు అసలు ఆసక్తి అక్కడే!
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పాలసీ









