ప్రజాస్వామ్యంపై దాడి
ఎన్నికల ప్రక్రియలో ప్రత్యర్థులను అడ్డుకోవడం, ఓటు హక్కును హరించడం, అధికార వ్యవస్థల మౌనం.. ప్రజాస్వామ్య పునాదులనే ప్రశ్నిస్తున్న పరిణామాలు!
ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికలు నిర్వహించడం కాదు.. ప్రతి అభ్యర్థికి సమాన అవకాశాలు కల్పించడం, ప్రతి ఓటరుకు తన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునే అవకాశం ఇవ్వడం, ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా సాగేందుకు వ్యవస్థలు బాధ్యతగా వ్యవహరించడం. కానీ ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధంగా కనిపిస్తున్నాయి.
ప్రత్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం.. ఎలాగోలా నామినేషన్లు దాఖలు చేసినా అధికారుల ద్వారా వాటిని తిరస్కరించే ప్రయత్నాలు చేయడం.. ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోకుండా అడ్డంకులు సృష్టించడం.. రిగ్గింగ్‌కు పాల్పడడం.. పొరపాటున ప్రత్యర్థులు విజయం సాధిస్తే ఆ ఫలితాన్ని ప్రకటించకుండా అధికారులపై ఒత్తిళ్లు తీసుకురావడం వంటి ఆరోపణలు ఎన్నికల వ్యవస్థపై తీవ్ర అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.
ప్రజాస్వామ్యంపై దాడి
ఇదేనా ప్రజాస్వామ్యం? ప్రజల తీర్పును గౌరవించాల్సిన వ్యవస్థలు, ప్రజల హక్కులను కాపాడాల్సిన అధికారులు.. ఇలాంటి పరిణామాలపై మౌనం వహిస్తే ప్రజాస్వామ్యానికి అర్థం ఏముంటుంది?
తొలి విడత నుంచి ఎన్నికల ప్రక్రియను పరిశీలిస్తే.. వివిధ దశల్లో ఇలాంటి ఘటనలు, ఆరోపణలు పదేపదే తెరపైకి వస్తున్నాయి. ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరగాల్సిన చోట భయాందోళనలు, బెదిరింపులు, దౌర్జన్యాలు చోటుచేసుకుంటున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాలను ప్రశ్నించే వారిపై దాడులకు దిగడం, వారిని భయపెట్టే ప్రయత్నాలు చేయడం మరింత ఆందోళనకరంగా మారుతోంది.
ఇన్ని ఘటనలు జరుగుతున్నా.. వాటిపై సమర్థవంతమైన చర్యలు తీసుకోవాల్సిన వ్యవస్థలు ప్రేక్షక పాత్ర వహించడం సిగ్గుచేటు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన సంస్థలే తమ బాధ్యతను విస్మరిస్తే ప్రజలకు న్యాయం ఎక్కడ దొరుకుతుంది? ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు నమ్మకం ఎలా నిలుస్తుంది?
ప్రజాస్వామ్యంపై దాడి
వ్యవస్థలపై నమ్మకం కోల్పోయిన ప్రజలు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం, నిరసనలకు దిగడం సహజ పరిణామమే. ప్రజల ఓటు హక్కును హరించే ప్రయత్నాలు జరిగితే వాటిని ప్రశ్నించే గొంతుకలు మరింత బలంగా వినిపించడం ప్రజాస్వామ్యంలో తప్పు కాదు. అయితే ఈ ఆగ్రహం హింసాత్మకంగా మారితే, అది వ్యవస్థల ఉనికికే ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉంది.
అందుకే ఇప్పటికైనా సంబంధిత వ్యవస్థలు కళ్ళు తెరవాలి. ఎన్నికల ప్రక్రియలో చోటుచేసుకుంటున్న అక్రమాలు, దౌర్జన్యాలు, బెదిరింపులపై నిష్పక్షపాత విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజల ఓటు హక్కును కాపాడటం, ఎన్నికల న్యాయబద్ధతను నిలబెట్టడం కేవలం రాజ్యాంగబద్ధ బాధ్యత మాత్రమే కాదు.. ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకు అత్యవసరం.
ప్రజాస్వామ్యం పేరుతో ప్రజల హక్కులనే కాలరాస్తుంటే.. ఆ దాష్టీకాలకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత వ్యవస్థలపై లేదా?
ప్రజాస్వామ్యంపై దాడి





